జైల్లో అంబటికి రాజభోగాలు.. కోర్టు ఇచ్చిన స్పెషల్ పర్మిషన్స్ ఇవే!

admin
Published by Admin — February 17, 2026 in Politics, Andhra
News Image

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మొదలైన ఈ అరెస్టుల పర్వం, ఇప్పుడు సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల వసూళ్ల కేసు వరకు వచ్చి ఆగింది. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కొత్త కేసు వెలుగులోకి రావడంతో అంబటి ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే, బయట బెయిల్ రాకపోయినా, జైలు లోపల మాత్రం తన రేంజ్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు అంబ‌టి.

గతంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రాజమండ్రి జైల్లో ఉండి, అక్కడ వసతుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు అంబటి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. బయట ఎలాగో గడవదు.. కనీసం లోపలైనా హాయిగా ఉండాలి కదా! అన్నట్టుగా గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. తన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా జైలు తిండి పడదని, నేల మీద పడుకోలేనని మొరపెట్టుకున్నారు. దీనికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇప్పుడు అంబటికి జైల్లో రాజభోగాలు సిద్ధమయ్యాయి.

కోర్టు ఆదేశాల ప్రకారం అంబటికి ఇప్పుడు జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ అందనుంది. జైలు చారు, ముద్ద పప్పుతో పని లేకుండా.. వేడివేడిగా ఇంటి నుంచే భోజనం పార్సెల్ రానుంది. రాజమండ్రి జైలు గదుల్లో గట్టి నేల మీద పడుకోవడం కష్టమని భావించిన ఆయనకు, ఇప్పుడు స్పెషల్ బెడ్ రెడీ అయిపోయింది. ఇక మందులు, డాక్టర్ల పర్యవేక్షణ కూడా తోడవడంతో.. ఇది రిమాండ్ లా కాకుండా, ఏదో హెల్త్ రిసార్ట్ లో ఉన్నట్టుగా ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

వైసీపీ శ్రేణులు మాత్రం ``అంబటి రాంబాబు ఎక్కడున్నా రాజే`` అని సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటున్నారు. నిజమే.. జైల్లో ఉన్నా రాజులాగే వసతులు పొందడం అంబటికే చెల్లింది. కానీ, ఆ రాజరికం కేవలం నాలుగు గోడల మధ్యే పరిమితం కావడం అసలైన ట్విస్ట్. ఒకవైపు బెయిల్ పిటిషన్లు 18వ తేదీకి వాయిదా పడుతుంటే, మరోవైపు కొత్త కేసులు లైన్లో ఉంటున్నాయి. వసతులు పెరిగాయి సరే.. వాడుకలో ఉన్న బెయిల్ ఎప్పుడు వస్తుంది? అని ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

Tags
Ambati Rambabu AP Politics YSRCP Andhra Pradesh Rajahmundry Jail Guntur Court
Recent Comments
Leave a Comment

Related News