కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్.. పట్టుబట్టారు.. సాధించారు. తన సొంత ఇలాకా కరీంనగర్ మునిసిపాలిటీలో తొలిసారి బీజేపీ పాగా వేసింది. వాస్తవానికి ఇక్కడ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ సహా.. ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్‌కు సరిపోయేలా ఫలితం రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లు ప్రయత్నించాయి. అయినప్పటికీ.. బండి చాకచక్యంగా వ్యవహరించి కరీంనగర్‌పై కాషాయ పతాకాన్ని ఎగురవేయించారు.
ఏం జరిగింది?
కరీంనగర్ మునిసిపాలిటీలో 66 వార్డులు వున్నాయి. వీటిలో మేజిక్ ఫిగర్ 34 వార్డులు గెలిచిన పార్టీకే అధికారం దక్కుతుంది. మేయర్ పీఠం సొంతం అవుతుంది. కానీ, ఏపార్టీకీ 34 సీట్లు రాలేదు. బీజేపీ: 30, కాంగ్రెస్: 14, బీఆర్ఎస్: 9, స్వతంత్రులు: 8, ఎంఐఎం: 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్: 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ ఎస్, ఇండిపెండెంట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు జట్టు కట్టేందుకు రెడీ అయ్యారు. అయినా.. మెజారిటీ దక్కలేదు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన.. బండి సంజయ్.. ఇండిపెండెంట్లు 8 మందిని తనవైపు తిప్పుకోగలిగారు. దీంతో మెజారిటీ ఫిగర్ 38కి చేరింది. ఫలితంగా బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మేయర్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఇది కూడా బీజేపీకి కలిసి వచ్చింది. కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్‌రావులు విజయం దక్కించుకున్నారు. ఎన్నిక ప్రక్రియకు హాజరైన సభ్యులలో నిర్ణీత 51 శాతం ఓట్లను బీజేపీ సొంతం చేసుకుంది.