బిల్ గేట్స్ పర్యటన - వివాదాల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?

admin
Published by Admin — February 19, 2026 in Andhra
News Image

ప్రస్తుతం 'మీడియా' ప్రసార మాధ్యమంగా కాక న్యాయస్థానంలా వ్యవహరిస్తున్నది. వ్యక్తులకు మంచి, చెడుల సర్టిఫికెట్లను కూడా మీడియానే ఇచ్చేస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వారు ఇచ్చే సర్టిఫికెట్లను కూడా వీరే ఇచ్చేస్తున్నారు. కోవా బన్ నుండి బిల్ గేట్స్ చేసే ఆరోగ్య సేవల వరకు అన్నింటినీ మీడియానే సమీక్షిస్తోంది. 'ఎప్‌స్టీన్ ఫైల్స్' లో ఉన్న విషయాలపైన కూడా వీరే దర్యాప్తు చేస్తారు. 

కాకపోతే, ఆ ఫైల్స్‌లో ఉన్న భారతీయుల గురించి కాక, బిల్ గేట్స్ గురించి మాత్రమే వీరు ప్రజలకు తెలియజేస్తారు. వీరి సామాజిక బాధ్యత అంతవరకే! ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉండే బిల్ గేట్స్ వీరి మెయిన్ టార్గెట్. ఆయన వ్యక్తిగత జీవితం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం అనేది వీరి ప్రధాన ఆలోచన.

రక్షణరంగంలో అనుభవమే లేని అనిల్ అంబానీకి రక్షణ రంగానికి సంబంధించిన పనులు ఎలా కట్టబెట్టారు అని నిగ్గదీసే సామర్థ్యం వీరికి లేదు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాడు కాబట్టి, ఆయనకు ఆయన భార్యకు మధ్య ఉన్న వివాదం వీరికి చర్చనీయాంశం. మొన్న బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించడం వీరికి నచ్చకపోవడం దురదృష్టకరం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరిస్థితిని మార్చడానికి ముఖ్యమంత్రి గడ్డిపరక పట్టుదొరికినా గోదారిని ఈదాలి అనుకుంటుంటే, విపక్షానికి చెందిన సోషల్ మీడియా మాత్రం ఆపన్నహస్తం అందించడానికి వచ్చే బిల్ గేట్స్ లాంటి వారిని కూడా వ్యక్తిగత దూషణలతో, ఆయన పర్యటనను వ్యతిరేకిస్తోంది. ఆయన ఆంధ్రరాష్ట్రంలో ఎవరితోనూ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలను కలుపుకోవడానికి రావడం లేదు. వైద్యరంగానికి బిల్ గేట్స్ అందిస్తున్న సేవలను ఆంధ్రరాష్ట్రానికి కూడా విస్తరించే కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి ఆయనను అభ్యర్థించారు.

ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' ద్వారా విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలలో తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. చిత్తూరు, కుప్పం ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన 'సంజీవని' ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ప్రతి పౌరుడికి 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్' రూపొందించడం. ఏఐ (AI) ఆధారంతో తక్కువ ఖర్చుతో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తూ, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు పోషకాహార లోపాలను తగ్గించేందుకు ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలకు మద్దతు ఇస్తున్నారు.

బిల్ గేట్స్ ఏఐ ఆధారిత వ్యవసాయానికి, డిజిటల్ మ్యాపింగ్‌కు, రియల్ టైం గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు. ఒక ఫౌండేషన్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవడానికి, ఆయన వ్యక్తిగత జీవితానికి ఎందుకు ముడిపెడుతున్నారో అర్థం కాదు. వారు సమాజసేవకు కూడా పనికిరారు అనుకుంటే, భారతదేశంలో సగానికి పైగా రాజకీయనాయకుల పైన నిషేధం విధించాలి. అందులో ఆంధ్రప్రదేశ్‌లో అయితే పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎదుటి పార్టీ వారిని శత్రువులుగా భావించడమే తప్పు అనుకుంటుంటే, వారిని గౌరవించే వారిని కూడా శత్రువులుగా చూడటం మరింత తప్పు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహానాయకుడి పైన, ఆయన స్నేహితుడి పైన అమెరికాలో చాలాకాలం క్రితమే ఆరోపణలు నమోదు కాగా, తన కంపెనీ జనరేట్ చేస్తున్న పవర్‌ను మార్కెట్ చేసుకోవడం కోసం 1750 కోట్ల లంచం ఇచ్చారు అంటూ అదానీ పైన నమోదైన కేసులో ఎవరి ప్రస్తావన ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆరోపణలు వచ్చిన వారే నేరస్థులైతే, ఛార్జ్ షీట్లు కూడా నమోదై ఉన్న కేసుల్లో ఉన్న నిందితులు కూడా నేరస్థులు అవుతారు. అనవసరపు వివాదాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం తప్ప మరో ప్రయోజనం ఈ నిరసనల్లో లేదు.

చంద్రబాబు నాయుడు విధానాలను విమర్శిస్తే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, బిల్ గేట్స్‌ను విమర్శించడం వలన రాష్ట్ర ప్రజల మన్నన చూరగొనే అవకాశం ఉంటుందని సలహాలు ఇచ్చేవారు ఎవరో అర్థంకాదు. ప్రపంచ ప్రజల మన్ననలను అందుకున్న మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్, తన ఆస్తిలో 99 శాతం 2045 లోపు చారిటీకి ఖర్చు చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తిని విమర్శించడం వలన ఒనగూరే ప్రయోజనం ఏంటో ఎవరికీ అర్థంకాదు. రాష్ట్ర ప్రయోజనాలను కూడా చంద్రబాబు వ్యక్తిగత విషయంగానే పరిగణించడం వలన రాజకీయంగా నష్టం కలిగించే అవకాశమే ఎక్కువ.

బిల్ గేట్స్ ఆంధ్రరాష్ట్రానికి వచ్చి 890 కోట్ల మేర విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలలో సహకారం అందించడానికి సిద్ధమయ్యారు. ఆయనేమీ చంద్రబాబు నాయుడు బంధువు కాదు, ఆయన సామాజికవర్గం కూడా కాదు. ఆయనకు కావాల్సింది చంద్రబాబు విజన్. ఒకనాడు చంద్రబాబు ఇంటర్నెట్ గురించి మాట్లాడితే హేళన చేశారు. భారతదేశంలో మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ అన్నప్పుడు ఆయన్ని చూసి నవ్వారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. ప్రస్తుతం ప్రపంచం వాటి మీదనే నడుస్తోంది. ఇప్పుడు అమరావతి నుండి బిల్ గేట్స్ దోచుకుపోయే సంపద ఏమిటి?

భిన్నత్వంలో ఏకత్వం కలిగి, జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశంలో తన ప్రయోగాలు విజయవంతమైతే, ప్రపంచ దేశాలన్నింటిలోనూ విజయం సాధించవచ్చు అనేది బిల్ గేట్స్ మాట. ఇప్పుడు దానికి రకరకాల అర్థాలు చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా చూస్తున్నారని నల్లజెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. చంద్రబాబును 'ఫ్రెండ్' అని పిలుస్తున్నందుకు ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది కొందరికి. ఆయన ఒకవేళ మైక్రోసాఫ్ట్ యాజమాన్యాన్ని ఒప్పించి ఏదైనా ఎస్టాబ్లిష్ చేయిస్తే, అప్పుడు "మేమే ముందుగా మాట్లాడింది" అని క్లెయిమ్ చేసినా ఆశ్చర్యం లేదు.

వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టాల్సింది పోయి, పెట్టుబడి పెడతారు అనుకున్న ప్రతివారిని బెదిరిస్తూ, బిల్ గేట్స్ లాంటి వారి పర్యటనకు నిరసనలు తెలుపుతూ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థంకావడంలేదు. పొరుగున ఉన్న తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వారందరిదీ ఒకటే మాట. ఆఖరకు నిన్నకాక మొన్న వచ్చిన విజయ్ తో సహా, రాష్ట్ర ప్రయోజనాలకే తొలిప్రాధాన్యత అంటూ కొన్ని పార్టీలను దూరం పెడుతున్నారు. దేశంలో చైతన్యవంతమైన రాష్ట్రంగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో, నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయం.!

Tags
Reasons behind Controversies Bill gates Amaravati tour ycp
Recent Comments
Leave a Comment

Related News