కవిత కొత్త పార్టీ ప్రకటన.. కేసీఆర్ గడ్డపై నుంచే సమరం!

admin
Published by Admin — February 19, 2026 in Politics, Telangana
News Image

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఒక్కసారిగా పొలిటికల్ బాంబ్ పేల్చారు. హైదరాబాద్‌లోని జాగృతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. త్వరలోనే సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు స్పష్టం చేస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు.

మే నెలలోనే ముహూర్తం.. పేరులో `తెలంగాణ`!
సరికొత్త ఆశయాలతో వస్తున్న ఈ పార్టీ ప్రకటనకు మే నెల మొదటి వారాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, తన పార్టీ పేరులో కచ్చితంగా `తెలంగాణ` అనే పదం ఉంటుందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షలే అజెండాగా మా ప్రయాణం సాగుతుంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఆమె పోటీ చేయబోయే నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నుంచి బరిలోకి దిగనున్నట్లు కవిత వెల్లడించారు. ఇందులో సిద్దిపేట తన మొదటి ప్రాధాన్యత అని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి పునాది అయిన సిద్దిపేట గడ్డ నుంచే తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా, ఆమె ఒక బలమైన రాజకీయ సంకేతాన్ని పంపారు.

కాగా, తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా నమ్మే కవిత, కొత్త పార్టీ ద్వారా యువతను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఒకవైపు తండ్రి వారసత్వం, మరోవైపు సొంత రాజకీయ అస్తిత్వం.. ఈ రెండింటి మధ్య కవిత అడుగులు ఎటువైపు పడతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags
Kalvakuntla Kavitha Telangana Politics New Political Party Siddipet Telangana Jagruthi KCR BRS
Recent Comments
Leave a Comment

Related News