ఉగాదికి ఏపీలో డీఎస్సీ కానుక.. ఈసారి సిలబస్ మార‌బోతుందా?

admin
Published by Admin — February 19, 2026 in Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉగాది కానుక అందించేందుకు సిద్ధమైంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీ మేరకు విద్యాశాఖ మరో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తోంది. సుమారు 3,600 పోస్టులతో ఈ కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇందులో గతేడాది మిగిలిపోయిన పోస్టులతో పాటు ఆదర్శ పాఠశాలలు, రెసిడెన్షియల్ సంస్థలు మరియు సంక్షేమ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

కొత్త నోటిఫికేషన్ వస్తుందన్న వార్తతో పాటు, సిలబస్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న ఆందోళన చాలా మంది అభ్యర్థుల్లో మొదలైంది. అయితే, అభ్యర్థులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ ఉగాది డీఎస్సీకి పాత సిలబస్‌నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రకటించిన మార్గదర్శకాలే వర్తిస్తాయి కాబట్టి, ఇప్పటికే ప్రిపరేషన్‌లో ఉన్నవారు తమ పంథాను మార్చుకోవాల్సిన పనిలేదు.

ఇంగ్లీష్, కంప్యూటర్ పరీక్షల పరిస్థితి ఏంటి?
నిజానికి ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, ప్రస్తుతానికి ఈ అదనపు పరీక్షల ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం. ఉగాది నోటిఫికేషన్‌లో వీటి ప్రస్తావన ఉండకపోవచ్చు. అంటే, గతంలో ఉన్న పద్ధతిలోనే పరీక్షా విధానం సాగనుంది. ఇది అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ యువత వాటా పెరగాలన్న లక్ష్యంతో, రాబోయే డీఎస్సీకి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి సవిత ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. అటు పోస్టుల భర్తీ, ఇటు ఉచిత శిక్షణతో అభ్యర్థులకు అన్ని విధాలా అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేసి, కొత్త టీచర్లతో పాఠశాలలను కళకళలాడించడమే విద్యాశాఖ లక్ష్యం.

Tags
AP DSC 2026 Andhra Pradesh DSC Notification Teacher Jobs Ugadi 2026 Mega DSC Nara Lokesh
Recent Comments
Leave a Comment

Related News