సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఏ2గా ఎమ్మెల్సీ సతీమణి

admin
Published by Admin — February 19, 2026 in Andhra
News Image

రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసుకు సంబంధించి కొత్త కోణాన్ని ఆవిష్కరించింది సిట్. డ్రైవర్ ను చంపేసి.. ఇంటికి కారులో పార్సిల్ పంపిన వైనం అప్పట్లో షాకింగ్ ఉదంతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఏ1గా ఉండగా.. తాజాగా ఈ కేసును విచారించిన సిట్.. ఎమ్మెల్సీ సతీమణి అనంత లక్ష్మీ దుర్గ అలియాస్ రోజా కూడా పాల్గొన్నట్లుగా పేర్కొంటూ ఏ2గా స్పష్టం చేసింది. ఈ హత్యకు ప్రేరేపించటమే కాదు.. హత్యోదంతంలో భర్తకు అన్ని విధాలుగా ఆమె సహకరించినట్లుగా నిర్దారించింది.

హత్య తర్వాత ఆధారాల ధ్వంసం.. మాయం చేసే అంశంలోనూ ఎమ్మెల్సీ సతీమణి కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. ఈ కేసులో ఆమెను ఏ2గా చేరుస్తూ.. నిందితురాలు హత్య, హత్యకు ప్రేరేపించటంతో పాటు ఆధారాల్ని ధ్వంసం చేసిన అభియోగాల్ని మోపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో బుధవారం ఛార్జిషీట్ ను దాఖలు చేసింది.

అందులో ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి పాత్రను స్పష్టం చేస్తూ.. కీలక అంశాల్ని ప్రస్తావించారు. హత్య గురించితనకు తెలీదని.. ఆ సమయంలో తాను అక్కడ లేనని.. ఆసుపత్రిలో బంధువులను పరామర్శించేందుకు వెళ్లినట్లుగా గతంలో అనంతబాబు సతీమణి పోలీసులకు చెప్పారు. ఆమె చెప్పిన సమయంలో సదరు ఆసుపత్రిలో లేరన్న విషయాన్ని సీసీ కెమేరా ఫుటేజీల అనంతరం విశ్లేషణలో సిట్ తేల్చారు. అదే సమయంలో హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఆమె ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. దీంతో.. ఆమె చెప్పిన వాంగ్మూలం అబద్ధంగా గుర్తించిన సిట్.. హత్యలో ఆమె పాత్ర కూడా కీలకమని తేల్చారు.

మరో కీలక అంశం ఏమంటే.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు ముందు ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణిలు వారు ఉండే శంకర్ టవర్స్ అపార్ట్ మెంట్ ఎదురుగా ఉండే ఈశ్వర ధరణి అపార్ట్ మెంట్స్ లో పలుమార్లు హడావుడిగా తిరుగుతూ కనిపించిన సీసీ ఫుటేజ్ ను సిట్ గుర్తించింది. హత్యకు ముందు.. ఆ తర్వాత నాలుగైదుసార్లు దుస్తులు మార్చుకొని కనిపించిన వైనాన్ని గుర్తించారు. ఇలా పలు కీలక సాంకేతిక అంశాల్ని గుర్తించిన సిట్.. ఎమ్మెల్సీ సతీమణిని ఏ2గా చేర్చారు.

ఈ కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయకుండానే.. కీలకమైనసాంకేతిక ఆధారాల్ని సేకరించకుండా వదిలేసినట్లుగా పేర్కొన్నారు. కీలకమైన సాంకేతిక ఆధారాల్ని సేకరించకుండా వదిలేయంతో పాటు ప్రధాన నిందితుడు అనంతబాబుకు దన్నుగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది జులైలో తదుపరి దర్యాప్తుకోసం సిట్ ను ఏర్పాటు చేసింది. ప్రాసిక్యూషన్ కు సహకారం అందించేందుకు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు.. కాల్ రికార్డులు.. సాక్షుల వాంగ్మూలాలు.. ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ను ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించింది. దీంతో అనేక కొత్త అంశాలు వెలుగు చూశాయి. వీటన్నింటిని ఛార్జిషీట్ తో పొందుపర్చారు.

Tags
Ycp mlc anantababu's wife a2 driver's murder case
Recent Comments
Leave a Comment

Related News