అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు...మండలి సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. తమకు మంద బలం ఉన్న మండలిలో అయినా ప్రజా సమస్యలపై మాట్లాడతారనుకున్న ప్రజలకు వైసీపీ ఎమ్మెల్సీలు నిరాశ మిగులుస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు వాయిదా తీర్మానం ఇస్తే..మరో వైసీపీ ఎమ్మెల్సీ ఇందాపూర్ డెయిరీపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్సకు లోకేశ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మండలిలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలపై పట్టు కోల్పోయారని లోకేశ్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అన్నట్లు తెలుస్తోంది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పర విరుద్ధంగా రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చారని లోకేశ్ గుర్తు చేశారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చకు...మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చకు డిమాండ్ చేస్తున్నారని చురకలంటించారు. అయితే, ఆ ఇద్దరు ఎమ్మెల్సీల పోరులో ఎవరిది పైచేయో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందన్నారు.
శాసనమండలి చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. సంబంధంలేని కంపెనీలు, వ్యవహారాల గురించి వైసీపీ సభ్యులు దూషించేవిధంగా వాయిదా తీర్మానాలు ఇచ్చి, సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అనురాధ మాట్లాడారు. చైర్మన్ సభను అదుపులో పెట్టడంలో విఫలం అయ్యారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.