అంబ‌టి పిల్లి శ‌ప‌థాలు..వైసీపీలోనే సెటైర్లు

admin
Published by Admin — February 19, 2026 in Andhra
News Image

రోజూ తిడుతున్నారు.. కొడుతున్నారు.. ఇంక ఈ పొయ్యిలో ప‌డుకునేది లేదు అంటూ.. పిల్లి చేసే శ‌ప‌థాల మాదిరిగా.. వైసీపీ సీనియ‌ర్ నేత‌ అంబ‌టి రాంబాబు కూడా.. శ‌ప‌థం చేశారు. తాజాగా ఆయ‌న‌కు సంక్రాంతి సంబ‌రాల ల‌క్కీ డ్రా కేసులో బెయిల్ ల‌భించ‌డంతో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలునుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. గ‌త నెల 31 నుంచి జైల్లో ఉన్న ఆయ‌న‌.. బ‌య‌ట‌కు రాగానే కూట‌మి స‌ర్కారుపై శ‌ప‌థ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

కూటమి స‌ర్కారును కూల్చే వ‌ర‌కు తాను నిద్ర‌పోన‌ని.. అంబ‌టి భారీ శ‌ప‌థ‌మే చేశారు. త‌న‌పై క‌క్షగ‌ట్టి జైలుకు పంపించార‌ని.. పీటీ వారెంట్ల‌తో కేసుల‌పై కేసులు పెట్టి.. జైల్లోనే నిర్బంధించాల‌ని చూశార‌ని అన్నారు. కానీ.. జైల్లో ఉన్నా.. అది త‌న‌కు శిక్ష‌ణ కేంద్రంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌కు వేదిక‌గా కూడా త‌యారైంద‌ని వ్యాఖ్యానించారు.(గ‌తంలో స్వాతంత్ర స‌మ‌ర యోధులు ఇలానే చెప్పారు. అంటే అర్థం ఉంది. వారు దేశం కోసం పోరాడారు. మ‌రి అంబ‌టి ఎవ‌రి కోసం జైలుకు వెళ్లారో అంద‌రికీ తెలిసిందేన‌ని వైసీపీ కేడ‌రే గుస‌గుస‌లాడింది.)

కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌పై ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్ర‌జ‌ల కోసం త‌న పోరాటం ఆగ‌బోద‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. కూటమి స‌ర్కారును కూల్చేంత వరకూ పోరాడతానని చెప్పారు. అవ‌స‌ర‌మైతే.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌ర్య‌టిస్తాన‌న్నారు. ``ఎన్ని కేసులు పెట్టిన ఒక్క అడుగు కూడా వెనక్కు వేయను. ఈ పోరాటం ఆగదు.. ఎన్నిసార్లు జైల్లో పెట్టిన వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు.`` అని శ‌ప‌థం చేశారు.  

సాధ్య‌మేనా?

అంబ‌టి చేసిన శ‌ప‌థాల‌పై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌న సొంత నియోజ‌క‌వ ర్గం స‌త్తెన‌ప‌ల్లిలోనే అంబ‌టి ప్ర‌భావం కోల్పోయార‌ని.. ఇదే ఆయ‌న‌కు పెద్ద స‌వాలుగా మారింద‌ని అంటు న్నారు. అంతేకాదు.. అంబ‌టి మైన‌స్ అవుతున్నార‌న్న ఉద్దేశంతోనే.. వైసీపీ అధినేత ఆయ‌న‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గం చూసుకోవాల‌ని కూడా చెబుతున్నార‌ని అంటున్నారు. ఇలాంటి నాయ‌కుడు కూట‌మిని కూల్చేస్తాన‌ని.. అధికారం నుంచి దింపేస్తాన‌ని అన‌డం.. పిల్లి శ‌ప‌థాలేన‌ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుండడం గ‌మ‌నార్హం.

Tags
Ycp Ambati rambabu satires inside talk
Recent Comments
Leave a Comment

Related News