ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ సభ్యులు చేపట్టిన షర్ట్‌లెస్ నిరసనఫై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. టీ-షర్టులపై ‘ఎప్‌స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’ వంటి వాక్యాలు, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ఈ క్రమంలోనే దేశం పరువు తీశారంటూ కాంగ్రెస్ పై బీజేపీ మండిపడుతోంది. ఆ సదస్సును బీజేపీ నిర్వహించడం లేదని, భారత దేశం తరఫున కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చురకలంటించింది.
అయితే, తమ చర్యను యూత్ కాంగ్రెస్ సభ్యులు సమర్థించుకుంటున్నారు. మహాత్మా గాంధీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకొని తమ నిరసన సరైనదేనని వివరణనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
"మేము గాంధీజీ వారసులం, షర్ట్‌లెస్ అయినా ఫర్వాలేదు" అని యూత్ కాంగ్రెస్ తన అఫిషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ సభ్యుల తీరును ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రతినిధులు వచ్చి ఏఐ ఆవిష్కరణలు చూపిస్తున్నారని, అటువంటి చోట కాంగ్రెస్ వాళ్లు దుస్తులు విప్పి తిరగడం బాధ కలిగించిందని, ఆందోళన కలిగించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనపై వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. ఏఐ సమ్మిట్ లో మనమంతా సిగ్గుపడేలా యూత్ కాంగ్రెస్ వ్యవహరించిందని, మన రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయని ప్రశ్నించారు. మన దేశాన్ని ఎవరూ, ఎప్పుడూ కించపరచకూడదని చెప్పారు.