నారా లోకేష్ ఏర్పాటుచేసిన ఆత్మీయ కలయిక..అపూర్వ వేదికగా మార్చారు శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సోమవారం ఇచ్చిన విందు నవ్వుల విందుగా అతిథులందరికీ ఆనందాన్ని పంచింది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ..కుటుంబసభ్యులను పరస్పరం పరిచయం చేసుకున్నారు.
క్షణాల్లోనే అందరూ ఆత్మీయుల్లా మారిపోయి నవ్వుతూ..నవ్విస్తూ అపురూప క్షణాలను ఆస్వాదించారు. ఒక్కరి ఫోనూ రింగ్ కాలేదు. విందు సమావేశం ముగిసేంతవరకూ ఎవ్వరూ బయటకు కదలలేదు. ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లల బాగోగులు, ప్రాంత ప్రత్యేకతలు చర్చించుకున్నారు. శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి.
మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో తన నియోజకవర్గం మంగళగిరి చేనేత ప్రమోషన్ కు శ్రీకాకుళం ప్రజాప్రతినిధులు పొందూరు ఖాదీతో కౌంటరిచ్చారు. మహాత్మాగాంధీ మెచ్చిన పొందూరు ఖాదీ పంచెలు బహుకరించారు. ప్రజాప్రతినిధులు తనకు ఇచ్చిన వినతుల తాజా నివేదికలను వారికి లోకేష్ అందించారు. నేతల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.
ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, ఎమ్మెల్యేలు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం), గౌతు శిరీష (పలాస), మామిడి గోవిందరావు (పాతపట్నం), గొండు శంకర్ (శ్రీకాకుళం), కూన రవికుమార్ (ఆమదాలవలస), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్ (గజపతినగరం), కోండ్రు మురళీ మోహన్ (రాజాం), బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు (బేబీనాయన- బొబ్బిలి), కిమిడి కళా వెంకటరావు (చీపురుపల్లి), పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు (విజయనగరం) లోకం మాధవి (నెల్లిమర్ల – జనసేన), నడికుదిటి ఈశ్వరరావు (ఎచ్చెర్ల – బీజేపీ) కుటుంబసభ్యులతో హాజరయ్యారు.