అంజలికి ఘోర అవమానం.. ఎయిర్‌పోర్ట్‌లోనే అరగంట నిల‌బెట్టారా?

admin
Published by Admin — February 24, 2026 in Movies
News Image

సినిమా తారలకు బయట ఉండే క్రేజ్ వేరు. వారు ఎక్కడికి వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతాలు, పూలమాలలు, సెక్యూరిటీ హడావిడి కనిపిస్తుంది. కానీ, తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అంజలికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి` చిత్రానికి గానూ ఉత్త‌మ స‌హాయ‌క న‌టిగా ఫిల్మ్‌ఫేర్‌కు ఆమె ఎంపిక అయింది. ఈ నేప‌థ్యంలోనే కేరళలోని కొచ్చిలో జరిగిన ప్రతిష్టాత్మక `ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026(Filmfare Awards South 2026)` వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లిన అంజలికి అక్కడ ఘోర అవమానం జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

సాధారణంగా ఇలాంటి పెద్ద అవార్డు వేడుకలకు పిలిచినప్పుడు, సెలబ్రిటీల ప్రయాణం నుండి బస వరకు అన్ని ఏర్పాట్లు నిర్వాహకులే చూసుకోవాలి. అంజలి(Anjali) కూడా అదే నమ్మకంతో కొచ్చి విమానాశ్రయంలో అడుగుపెట్టారు. తీరా ఎయిర్‌పోర్ట్ బయటకు వచ్చాక చూస్తే.. ఆమెను రిసీవ్ చేసుకునేవారే లేరు. అరగంటకు పైగా తన లగేజీ పట్టుకుని ఎయిర్‌పోర్ట్ బయట అంజలి ఒంటరిగా వేచి చూడాల్సి వచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి, అంతసేపు నడిరోడ్డుపై ఎవరూ పట్టించుకోకుండా నిలబడటం ఆమెను తీవ్రంగా కలిచివేసింది.

దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అంజలి చాలా అసహనంగా, నిరాశగా కనిపిస్తున్నారు. తన పట్ల నిర్వాహకులు ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం చూసి నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ``అవార్డు ఫంక్షన్‌కు పిలిచి గౌరవించాల్సింది పోయి, ఇలా ఎయిర్‌పోర్ట్‌లో గాలికి వదిలేస్తారా?`` అంటూ ఫిల్మ్‌ఫేర్(Filmfare) టీమ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. అంజలి లాంటి నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక చిన్న కళాకారుల పరిస్థితి ఏంటని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేవలం అంజలి మాత్రమే కాదు, అదే ఈవెంట్‌పై నిర్మాత నిహారిక కొణిదెల(Niharika Konidela) కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. కొత్త టాలెంట్‌కు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, కనీసం స్టేజీపై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె పోస్ట్ చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. మొత్తం మీద కొచ్చి ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్ అవార్డుల కన్నా, సెలబ్రిటీలకు జరిగిన అవమానాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

Tags
Actress Anjali Filmfare Awards South 2026 Anjali Viral Video Filmfare Controversy Niharika Konidela Tollywood
Recent Comments
Leave a Comment

Related News