పంచెకట్టు..నుదుట బొట్టు.. నందీశ్వరుడికి జగన్ ప్ర‌త్యేక పూజలు!

admin
Published by Admin — February 25, 2026 in Politics, Andhra
News Image

పులివెందుల: వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్యాత్మిక ముద్రలో మెరిశారు. వేంపల్లి మండలం నందిపల్లిలో నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో ఆయన పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నుదుట బొట్టు, పంచెకట్టుతో దర్శనమిచ్చిన జగన్, భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నందిపల్లికి చేరుకున్న జగన్‌కు ఆలయ అర్చకులు, పండితులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఆయన, తొలుత నంది విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూలమాలను సమర్పించారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జగన్ దంపతుల తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు.

ఆలయ ప్రతిష్టాపనలో భాగంగా హోమశాల వద్ద ఏర్పాటు చేసిన యజ్ఞయాగాది కార్యక్రమాల్లో వైసీపీ బాస్‌ పాల్గొన్నారు. పండితుల సూచనల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం జగన్ నేరుగా పులివెందులకు బయలుదేరారు. అక్కడ తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

కాగా, అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో హిందూ సంప్రదాయాల పట్ల, ఆలయాల పట్ల జగన్ వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి.  అయితే ఇప్పుడు అధికారం కోల్పోయి, కేడర్ చెల్లాచెదురవుతున్న వేళ.. మళ్ళీ హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకే ఈ భక్తి వేషధారణ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags
YS Jagan Pulivendula Andhra Pradesh YSRCP Nandiswara Temple Nandipalli AP Politics
Recent Comments
Leave a Comment

Related News

Latest News