తిరిగొస్తే చెప్పు దెబ్బలే.. జంపింగ్ నేతలకు కేతిరెడ్డి మాస్ వార్నింగ్!

admin
Published by Admin — February 25, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్‌లకు కాలం చెల్లిందా? అధికారం ఉన్నప్పుడు అందలం ఎక్కి, కష్టం రాగానే కండువాలు మార్చే నాయకులకు ఇక చెక్ పడినట్లేనా? అంటే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) అవుననే అంటున్నారు. వైసీపీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారిపై ఆయన వాడిన పదజాలం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ``అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి.. ఇప్పుడు పారిపోయిన వారు మళ్లీ వస్తామంటే చెప్పుతో కొడతాం`` అంటూ ఆయన చేసిన కామెంట్స్ చ‌ర్చ‌కు దారితీశాయి.

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ బలోపేతం కోసం కొత్తవారు రావాలని కోరుకుంటారు. కానీ కేతిరెడ్డి రూటే సెపరేట్. ``పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి, కష్టం రాగానే జంప్ అయిన వారికి మళ్ళీ ఈ పార్టీలో చోటు లేదు` అని ఆయన కుండబద్దలు కొట్టారు. శత్రువునైనా క్షమించి పార్టీలోకి రానిస్తానేమో కానీ, వెన్నుపోటు పొడిచిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వనని భీష్మించుకున్నారు. ఒకవేళ ఎవరైనా బంధుత్వం లేదా స్నేహం పేరుతో వెనక్కి రావాలని చూస్తే.. గేటు దగ్గరే చెప్పుతో కొట్టి పంపుతామంటూ ఆయన ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ జెండా మోసే కార్యకర్త ఎప్పుడూ పార్టీతోనే ఉంటాడని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. పదవుల కోసం పాకులాడే క్యారెక్టర్ లేని నాయకుల కంటే, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడే కార్యకర్తలే జగనన్నకు అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ(YSRCP) మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు, కష్టపడిన కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పదవుల కోసం గంతులు వేసే జంపింగ్ నేతలకు కాదని ఆయన స్పష్టం చేశారు.

అయితే కేతిరెడ్డి(Kethireddy) వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయాల్లో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం సర్వసాధారణం. గతంలో కేతిరెడ్డి కుటుంబం కూడా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారిన సంద‌ర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూటమికి ఓటు వేసిన వారు లేదా పార్టీ వీడిన వారు మళ్ళీ తిరిగి రాకూడదంటే, ఏ రాజకీయ పార్టీ కూడా భవిష్యత్తులో గెలవడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి ``చెప్పుతో కొడతాం`` వంటి కఠినమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సమ‌ని సొంత పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌.

Tags
Kethireddy Venkatarami Reddy YSRCP Dharmavaram AP Politics Jumping Leaders Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News

Latest News