చంద్రబాబుపై కేసుల్లో ట్విస్ట్.. బెడిసికొట్టిన ఆళ్ల `డ‌బుల్ గేమ్‌`!

admin
Published by Admin — February 25, 2026 in Politics, Andhra
News Image

గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అస్త్రాలు సంధించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు న్యాయస్థానాల్లో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు కింది కోర్టులో సాక్ష్యాలు చూపలేక, మరోవైపు హైకోర్టులో వేసిన పిటిషన్లపై ఛీత్కారాలు ఎదురవుతుండటంతో ఆయన అనుసరిస్తున్న డబుల్ గేమ్ వ్యూహం ఇప్పుడు రివర్స్ కొట్టినట్లు కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కుముడులతో కాలయాపన చేయాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఆళ్ల తదుపరి అడుగులు ఎటువైపో అన్న చర్చ రాజకీయ, న్యాయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

చంద్రబాబుపై గతంలో చేసిన ఫిర్యాదుల్లో కనీస ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థ సీఐడీ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. ఈ కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కొట్టివేయాలని కోరుతూ సీఐడీ స్వయంగా ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే, తన ఫిర్యాదులో పస ఉందని భావిస్తే ఫిబ్రవరి 27న విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరై సాక్ష్యాధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆళ్లకు నోటీసులు జారీ చేసింది. కింది కోర్టులో ఆధారాలు చూపే ధైర్యం లేకనే ఆళ్ల ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏసీబీ కోర్టులో విచారణను అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబుకు గతంలో మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆళ్ల హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇక్కడే ఆయనకు అసలైన షాక్ తగిలింది. స్వయంగా సీఐడీ తరపు న్యాయవాదులే ఈ పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారు నేరుగా హైకోర్టుకు రావడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, అసలు ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ విచారణకు అర్హమా కాదా అనే అంశంపైనే తాము ముందుగా నిర్ణయం తీసుకుంటామని విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

నిజానికి ఏసీబీ కోర్టులో విచారణ ముగిసిపోతే తన రాజకీయ ఉనికి దెబ్బతింటుందని, అందుకే హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందనే సాకుతో కింది కోర్టు విచారణను ఆపాలని ఆళ్ల ప్లాన్ చేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తప్పుడు కేసులతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నారన్న విమర్శలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటు ఏసీబీ కోర్టులో హాజరు కాక తప్ప‌దు, అలాగే ఇటు హైకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉండటంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ముందు నుయ్యి - వెనుక గొయ్యిలా తయారైంది.

Tags
Chandrababu Naidu Alla Ramakrishna Reddy AP Politics Andhra Pradesh High Court TDP YSRCP
Recent Comments
Leave a Comment

Related News

Latest News