రఘురామ గాయంపై పీవీ సునీల్ లాజిక్‌.. మళ్లీ మొదలైన వార్!

admin
Published by Admin — February 27, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మధ్య సాగే సోషల్ మీడియా యుద్ధం ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా రఘురామకు తగిలిన ఒక గాయం, వీరిద్దరి మధ్య నిప్పును మళ్లీ రాజేసింది. ఇటీవల రఘురామ కృష్ణంరాజు క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కింద పడటంతో ఆయన కుడి భుజం ఎముక విరిగింది. దీనికి సంబంధించిన ఎక్స్-రే రిపోర్టులు బయటకు రావడమే ఆలస్యం.. పీవీ సునీల్ కుమార్ రంగంలోకి దిగారు.

గతంలో రఘురామ తనపై చేసిన కస్టోడియల్ టార్చర్ ఆరోపణలను తిప్పికొట్టడానికి ఈ గాయాన్నే ఒక అస్త్రంగా మార్చుకున్నారు. ``జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. మరి నిజంగా క‌స్ట‌డీలో ఎవ‌రైనా కొట్టి ఉంటే ఇంకెన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?`` అంటూ ఆయన సంధించిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే పీవీ సునీల్ కుమార్ వేసిన ఈ ట్వీట్ వెనుక ఒక బలమైన వ్యూహం కనిపిస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో రఘురామను కస్టడీలో ఉన్నప్పుడు తీవ్రంగా హింసించారని, దానికి సునీల్ కుమారే బాధ్యుడని కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రఘురామ చిన్న ప్రమాదానికే ఎముకలు విరిగాయని చెప్పడాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. నాడు రఘురామ చెప్పినవన్నీ అబద్ధాలని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని సునీల్ కుమార్ గట్టిగా వాదిస్తున్నారు. రఘురామ చెప్పిన టార్చర్ నిజమైతే అప్పట్లోనే ఆయన ఎముకలు విరిగి ఉండాలి కదా అనేది సునీల్ కుమార్ లాజిక్. మ‌రి దీనికి రాఘురామ ఎలా బ‌దులిస్తారో చూడాలి. కాగా, ప్రస్తుతం ప్రభుత్వం పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగించిన నేపథ్యంలో, ఆయన మరింత దూకుడుగా స్పందిస్తున్నారు. అటు రఘురామ కూడా తక్కువ తినలేదు. తనకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా పోరాడుతూనే ఉన్నారు.  

Tags
Raghurama Krishnam Raju PV Sunil Kumar Andhra Pradesh AP Politics RRR Custodial Torture Case
Recent Comments
Leave a Comment

Related News

Latest News