వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంతర్గత యుద్ధం మొదలైందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల అంటేనే తాడేపల్లి అన్నట్లుగా సాగింది. పార్టీ గెలిచినా, ఓడినా జగన్ వెంటే ఉంటూ చక్రం తిప్పిన సజ్జలకు.. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూపంలో ఒక బలమైన సవాలు ఎదురవుతోంది. జైలు నుంచి వచ్చినప్పటి నుండి చెవిరెడ్డి వేస్తున్న అడుగులు, జగన్‌కు ఇస్తున్న రిపోర్టులు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సరికొత్త సింపతీ అస్త్రాన్ని జగన్ ముందు ఉంచారు. ప్రభుత్వం చేస్తున్న అరెస్టులను అడ్డుపెట్టుకుని ప్రజల్లో సానుభూతి సంపాదించాలని, మరిన్ని అరెస్టులు జరిగితేనే కేడర్‌లో కసి పెరుగుతుందని ఆయన నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఇమేజ్ గ్రాఫ్ మళ్ళీ పెరుగుతోందని చెవిరెడ్డి ఇస్తున్న పాజిటివ్ రిపోర్టులు ఇప్పుడు జగన్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన సజ్జల మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. మరిన్ని అరెస్టులు జరిగితే ద్వితీయ శ్రేణి నాయకత్వం కుప్పకూలుతుందని, పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సజ్జల హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
ఒకప్పుడు జగన్ ఇచ్చే స్టేట్మెంట్లు, సోషల్ మీడియా నెరేటివ్‌లు అన్నీ సజ్జల కనుసన్నల్లోనే జరిగేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. సోషల్ మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేయడం నుంచి జగన్ బయటకు వచ్చేటప్పుడు ఇచ్చే నివేదికల వరకు చెవిరెడ్డి పెత్తనం పెరిగిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తన మాటే వేదంగా సాగిన చోట ఇప్పుడు మరొకరి ప్రమేయం పెరగడంపై సజ్జల కొంత అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డి ఇచ్చే సింపతీ రిపోర్టులకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం సజ్జలకు మింగుడు పడటం లేదట.
ప్రస్తుతానికి జగన్ మాత్రం చెవిరెడ్డి చూపిస్తున్న అగ్రెసివ్ రూట్‌కే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేడర్‌లో జోష్ నింపాలంటే పోరాట పంథానే సరైనదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సజ్జల సూచించే చిక్కుముడి వ్యూహాల కంటే, చెవిరెడ్డి చెప్పే ఢీ అంటే ఢీ అనే పద్ధతి జగన్‌కు దగ్గరైంది. మరి తాడేపల్లిలో జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం చివరకు ఎటు దారి తీస్తుందో.. జగన్ పక్కన శాశ్వత వ్యూహకర్తగా ఎవరు నిలుస్తారో చూడాలి.