కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్(Thalapathy Vijay) వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఇండస్ట్రీలో దావానలంలా మారుతోంది. వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా, రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేయాలని చూస్తున్న తరుణంలో, ఆయన వైవాహిక బంధం ముక్కలైందనే వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్-సంగీత దంపతులు, సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్.
కేవలం విడాకులు తీసుకోవడమే కాకుండా, సంగీత(Sangeetha) తన పిటిషన్‌లో విజయ్‌పై మోపిన అభియోగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రధానంగా ఈ 7 కారణాలను ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా విజయ్ మరో సినీ నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, అదే తమ మధ్య చిచ్చు పెట్టిందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క కారణమే కాకుండా, గత రెండేళ్లుగా తాము ఇద్దరం ఒకే ఇంట్లో ఉండటం లేదని, విడివిడిగానే నివసిస్తున్నామని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ సుదీర్ఘ కాలంలో విజయ్(Vijay) తనను మరియు కుటుంబాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, కనీసం తప్పును సరిదిద్దుకునే పశ్చాత్తాపం కూడా ఆయనలో లేదని సంగీత ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఆర్థిక పరమైన ఆంక్షలు మరియు మానసిక వేధింపులకు సంబంధించిన అంశాలను కూడా ఆమె తన పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనకు కావాల్సిన కనీస స్వేచ్ఛను హరించడమే కాకుండా, తనను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేశారని సంగీత ఆరోపిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27 (1)(ఎ), సెక్షన్ 27(1)(బి), సెక్షన్ 27 (1) (డి) ప్రకారం ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని, దీనికి సంబంధించి ఏప్రిల్ 26న కోర్టు విచారణకు హాజరు కావాలంటూ విజయ్‌కు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు రాజకీయాల్లో తన ముద్ర వేయాలని చూస్తున్న విజయ్‌కు, ఈ విడాకుల వ్యవహారం మరియు భార్య మోపిన ఈ ఏడు అభియోగాలు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ వ్యవహారంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో అందరి కళ్లు ఇప్పుడు ఆ తేదీపైనే ఉన్నాయి.