60 ఏళ్ల చరిత్రకు ఎండ్ కార్డ్.. `ఏపీ` పేరు మారుతుందా?

admin
Published by Admin — February 28, 2026 in Politics, Andhra
News Image

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పేర్ల మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న కేంద్ర కేబినెట్ `కేరళ` రాష్ట్రాన్ని `కేరళం`(Keralam)గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. పశ్చిమ బెంగాల్ ఎప్పటి నుంచో `బంగ్లా` కావాలని కోరుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక సరికొత్త డిమాండ్ ఊపిరిపోసుకుంటోంది. గత 60 ఏళ్లుగా కొనసాగుతున్న `ఆంధ్రప్రదేశ్` అనే పేరుకు స్వస్తి పలికి, అచ్చతెలుగు అస్తిత్వం ఉట్టిపడేలా పేరు మార్చుకోవాలన్న చర్చ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956లో హైదరాబాద్ స్టేట్‌ను కలుపుకుని `విశాలాంధ్ర`(Visalaandhra)గా ఏర్పడినప్పుడు, నాటి కేంద్ర పెద్దల సూచన మేరకు `ఆంధ్రప్రదేశ్` అనే పేరు ఖరారైంది. అయితే, ఇక్కడే ఒక విమర్శ ఉంది. `ఆంధ్ర` అనేది తెలుగు పదం అయితే, `ప్రదేశ్‌` అనేది హిందీ పదం. ఈ రెండింటి కలయిక మన ప్రాంతీయ అస్తిత్వాన్ని పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదని భాషాభిమానుల వాదన. ఉత్తరాదిన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పేర్లు ఉండగా.. దక్షిణాదిలో మాత్రం తమిళనాడు, కేరళ (కేరళం), కర్ణాటక వంటి పేర్లు వారి భాషా గొప్పదనాన్ని చాటుతున్నాయి. మరి ఏపీకి మాత్రం ఆ హిందీ వాసన ఎందుకు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

ఒకప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు మనది `ఆంధ్ర రాష్ట్రం`. కర్నూలు రాజధానిగా మూడేళ్ల పాటు అదే పేరుతో పాలన సాగింది. కానీ, తెలంగాణతో కలిశాక అది `ఆంధ్రప్రదేశ్`(Andhra Pradesh) అయ్యింది. 2014లో విభజన జరిగినప్పుడు తెలంగాణ తన పాత అస్తిత్వాన్ని (హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణగా) తిరిగి తెచ్చుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం అదే పేరుతో మిగిలిపోయింది. ఇప్పుడు కేరళం నిర్ణయంతో.. ఏపీ కూడా తన పేరును మార్చుకుని సొంత గుర్తింపును చాటుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధానంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒక‌టి `ఆంధ్ర రాష్ట్రం`. పాత వైభవాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఈ పేరు పెట్టాలని కొందరి వాదన. పొరుగున ఉన్న తమిళనాడు తరహాలో, తెలుగు భాషా పరిమళం ఉట్టిపడేలా `ఆంధ్ర నాడు`(Andhra Nadu) బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు. జాతి కంటే భాషకే ప్రాముఖ్యత ఇస్తూ `తెలుగు నాడు` అని పిలవాలని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ఒక రాష్ట్రం పేరు మార్చడం అనేది కేవలం భావోద్వేగంతో కూడిన విషయం మాత్రమే కాదు.. దానికి అపారమైన పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన ప్రక్రియ అవసరం. అయితే కేరళం ఇచ్చిన స్ఫూర్తితో ఏపీలో మొదలైన ఈ పేరు మార్పు చర్చ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags
Andhra Pradesh AP Name Change Andhra Nadu Telugu Nadu Andhra State Keralam Telugu Pride
Recent Comments
Leave a Comment

Related News