దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam)కేసులో బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kavita)కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్(ktr).. ఈ కేసు కారణంగానే బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని చెప్పారు. అంతేకాదు.. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్(brs) ఓటమికి ఈ కేసే కారణమని వ్యాఖ్యానించారు. కవితకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా బీజేపీ పన్నాగం బయటపడిందన్నారు. తమపై పెట్టిన కేసులు రాజకీయ కక్షలో భాగమేనని చెప్పారు. నిజాలు బయటకు రానంత వరకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఇలానే కేసులు పెడతాయని వ్యాఖ్యానించారు.
అయితే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. తన అరెస్టుకు, బీఆర్ ఎస్ ఓటమికి సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించా రు. మద్యం కేసును అడ్డుపెట్టుకుని బీఆర్ ఎస్ తన ఓటమిని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ ఓటమికి,తనను మద్యం కేసులో అరెస్టు చేయడానికి సంబంధం లేదన్నారు. తాను ఈ కేసులో ఒక పావునేనని అన్నారు. తనను ఎందుకు అరెస్టుచేశారో.. తాను ఎవరి వల్ల బాధితురాలిని అయ్యానో చెబుతానని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ ఓటమి స్వయం కృత అపరాథమని చెప్పారు.
ప్రజలను లెక్కచేయకపోవడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం వంటివే బీఆర్ ఎస్ పరాజయానికి కారణాలుగా కవిత చెప్పారు. అహంకార పూరితంగా వ్యవహరించారు కాబట్టే.. ఆ పార్టీని ప్రజలు ఓడించారని కవిత వ్యాఖ్యానిం చారు. ``బీఆర్ ఎస్ ఓటమికి నేను కారణమా?`` అంటూ నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చిన ఇళ్లను ఇవ్వలే దని, ఉద్యోగాల ఊసే లేకుండా పదేళ్లు గడిపేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమ కారులను అడుగడుగునా అవమానించారని తెలిపారు. ప్రధానంగా.. బీఆర్ ఎస్ అహంకార పూరిత చర్యలే ప్రజలు ఓడించేలా చేశాయన్నారు.
అదేవిధంగా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ఎమ్మెల్యేలను మార్చకుండా.. దోపిడీ దారులకే మరోసారి టికెట్లు ఇచ్చారని.. కవిత చెప్పారు. ఇన్ని తప్పులపై తప్పులు చేశారు కాబట్టే తెలంగాణ సమాజం పక్కన పెట్టిందన్నారు. కానీ..ఇప్పుడు తాను మద్యం కేసులో అరెస్టు అయ్యాను కాబట్టే బీఆర్ ఎస్ ఓడిపోయిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని.. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటోందో తెలుసుకోవాలని ఆమె సూచించారు. తనపై నిందలు మోపడం వల్ల బీఆర్ ఎస్‌కు ఎలాంటి లాభం ఉండదని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుకు వక్ర భాష్యం చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.