టీడీపీ(tdp) అధినేత, సీఎం చంద్రబాబు(cm chandrababu )పై వైసీపీ సైకో సైన్యం కుట్రలు చేస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబుకు సంబంధం లేని విషయాలను జోడించి.. ఆయనకు అంటగట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వీటిపై విచారణ చేసి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ.. టీడీపీ నాయకులు వర్ల రామయ్య తదితరులు.. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు శుక్రవారం సాయంత్రం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి కుట్రల ద్వారా చంద్రబాబు ను ఏమీ చేయలేరని నాయకులు తెలిపారు.
ఏం జరిగింది?
`ఎఫ్‌బీఐ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల` పేరుతో సోషల్ మీడియాలో కొన్ని పత్రాలు హల్చల్ చేస్తున్నాయి. వీటిని దాము రెడ్డి అనే వ్యక్తి పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పత్రాల ద్వారా చంద్రబాబును ఒక హై ప్రొఫైల్ అనుమానితుడిగా చూపిం చే వికృత ప్రయత్నం చేస్తున్నారని.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మహిళలను అమితంగా గౌరవించే చంద్రబాబుకు లేని పోనివి అంటగట్టి.. ఇలా ఎఫ్‌బీఐ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల పేరుతో అగౌరవ పరిచే చర్యలు చేపట్టారని చెబుతున్నారు. చంద్రబాబుపై అశ్లీల ఆరోపణలు చేస్తున్న వారి సంస్కారం ఎలాంటిదో వారే ఆలోచించుకోవాలని చెబుతున్నారు.
రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే వైసీపీ(ycp) లక్ష్యమని టీడీపీ నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చిరకాలం గుర్తుండేలా చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని.. కానీ, దీనిని దారిమళ్లించి.. ప్రజల దృష్టిని మరలించేందుకే ఇప్పుడు క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల పేరుతో నీచ రాజకీయాలకు తెరదీశారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక సజ్జల రామకృష్ణారెడ్డికుమారుడు భార్గవ రెడ్డి నేతృత్వంలోని సోషల్ మీడియా 'సైకో సైన్యం` ఉందని ఆరోపించారు. కాగా.. టీడీపీ నేతలు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును సీఐడీడీజీ స్వీకరించారు. విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.