ఊహించినట్లుగానే బీహార్ కేడర్ ఐజి సునీల్ నాయక్ సామాజికవర్గం కార్డు తీశాడు. ఆనాటి నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన సునీల్ నాయక్, తనను అరెస్ట్ చేసే ప్రయత్నాన్ని సామాజికవర్గ టార్గెట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయటానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాట్నా వెళ్లగానే తన కుల ప్రస్తావన మొదలుపెట్టారు.
సునీల్ నాయక్ దేశంలో అత్యున్నత స్థాయి విద్యను అభ్యసించారు. ఆయన అభ్యసించిన విద్య ఆయనకు సంస్కారంతో పాటు, ఉద్యోగంలో ఆయన పాటించవలసిన నిబంధనలను కూడా నేర్పి ఉంటుంది. ఒక ఐపీఎస్ అధికారిగా, పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత అనేది వారి ప్రథమ బాధ్యత అని క్రిమినల్ చట్టాలలో చదవటమే కాక, వారి ట్రైనింగ్‌లో కూడా ప్రత్యేకంగా ఒకటికి పదిసార్లు చెప్పి ఉంటారు.ట్రైనింగ్ అయిపోయాక ఆయన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలో తన డ్యూటీని ఎంత నియమబద్ధంగా చేశారో తెలియదు కానీ, వైసీపీ హయాంలో ఆయన డిప్యుటేషన్ పైన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు మాత్రం కస్టోడియల్ టార్చర్‌కు పేరుగాంచారు.
ఆయన కుటుంబానికి వైసీపీతో దగ్గర సంబంధం ఉన్నది అంటున్నారు. అంతమాత్రాన ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేయటం మాత్రం ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఉన్నవారందరికీ అవమానం. విధి నిర్వహణలో ఉద్యోగులందరికీ ఒకే నియమావళి వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఉద్యోగ బాధ్యతల్లో ఒక్కొక్కసారి ఆరోపణలు ఎవరి మీదైనా రావచ్చు.
కానీ, చేసిన పొరపాట్లకు ప్రభుత్వం తీసుకునే చర్యల నుండి సామాజికవర్గం రీత్యా ఎటువంటి వెసులుబాటు ఉండదు. ఇంత చదువుకొని కూడా దుర్మార్గమైన పనులు చేసేటప్పుడు ఆలోచించకుండా, సమస్య వచ్చిన తర్వాత రాజకీయనాయకుల మాదిరి మాట్లాడటం ఒక ఐపీఎస్ అధికారికి సహేతుకం కాదు. జరిగిన తప్పులకు శ్రీలక్ష్మి దగ్గర నుండి పీఎస్ఆర్ ఆంజనేయులు వరకు అందరూ చట్టపరిధిలో అరెస్ట్ అయ్యారు.
అసలు సమస్య ఆలోచన.!
కూటమి ప్రభుత్వం మైనారిటీ వర్గాలను మాత్రమే టార్గెట్ చేసింది అనేది పొరపాటు. అధికారులను సామాజికవర్గాల వారీగా చీల్చింది వైసీపీ ప్రభుత్వం. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పీవీ సునీల్ కుమార్, సంజయ్, సునీల్ నాయక్ లాంటివారినే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఎన్నుకున్నదో జగన్మోహన్ రెడ్డిని అడగవలసిన ప్రశ్న. జెత్వానీ కేసులో ఊహించని విధంగా కొందరు ఇరుక్కుపోయారు. నిరాధారమైన ఆరోపణలతో చంద్రబాబు నాయుడు లాంటి ఒక జాతీయ నాయకుడిని అరెస్ట్ చేయటానికి సంజయ్‌నే ఎందుకు ఉపయోగించారో ఆలోచిస్తే తెలుస్తుంది.
చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సొంతపార్టీ ఎంపీనే అరెస్ట్ చేయటమే కాక, కస్టోడియల్ టార్చర్ చేయించాలనే ఆలోచన రాగానే అందుకోసం ఎన్నుకున్న టీంలో పైస్థాయి అధికారి నుండి క్రింది స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న వారందరూ బలహీనవర్గాల నుండి వచ్చిన వారే ఎందుకున్నారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది.
అర్హత లేకున్నా రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీని చేసి ఆయన చేతికి మట్టి అంటకుండా గౌరవంగా చూశారు. కానీ గౌతమ్ సవాంగ్‌ను మాత్రం అవమానకర రీతిలో సాగనంపారు. వాస్తవానికి గౌతమ్ సవాంగ్ ఒక ఎఫిషియంట్ అధికారి. తనను డీజీపీని చేయలేదనే బాధతో చంద్రబాబు నాయుడు పైన సవాంగ్‌కు ఉన్న కక్షను అడ్డం పెట్టుకుని ఆయనను ఉపయోగించుకున్నాడు జగన్.
ఆయన పదవీ విరమణ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఆర్ఆర్ఆర్ కేసులో పీవీ సునీల్ కుమార్‌ను ఉపయోగించుకుని, ఆయనకు ముందు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయించి, తరువాత ఎటువంటి ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. పీవీ సునీల్ కుమార్ కచ్చితంగా డీజీపీ అవ్వవలసిన అధికారే. ఉద్యోగ నిర్వహణలో అందుకు అవసరమైన కీర్తి ప్రతిష్టలు, పతకాలు ఆయనకు ఉన్నాయి. కానీ డీజీపీ అయ్యే అవకాశాన్ని చేజార్చుకుంది వైసీపీ వలనే అని సునీల్ కుమార్‌కూ తెలుసు.
డీజీపీ కాకపోవటమే కాదు, యూనిఫామ్‌కు కూడా దూరం చేశారు. ఒక డీజీపీ స్థాయి అధికారికి సస్పెన్షన్ కంటే యూనిఫామ్‌కు దూరమవటమే పెద్ద శిక్ష. ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా బాధపెట్టారో చూసి కూడా సునీల్ కుమార్, సంజయ్ లాంటివారు జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్మారో వారే చెప్పాలి.
ఈరోజు సునీల్ నాయక్‌నే తీసుకుంటే, ఒక తండా నుండి వచ్చి ఎంతో కష్టపడి ఐపీఎస్ అయి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఘర్షణ ఛానల్ బీవీఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులోనూ నిందితుడే. కూటమి కొలువు తీరగానే మళ్ళీ బీహార్‌కు పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే భయం. సునీల్ కుమార్ పారిపోలేదు, కానీ సునీల్ నాయక్ భయపడిపోయాడు.
ఇటువంటి పనులకు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు కానీ, ఒక్క దళిత అధికారికి మంచి పోస్ట్ ఇవ్వలేదు. సుచరితను హోమ్ మంత్రి అన్నారే కానీ గౌరవంగా ఆమెను పని చేయనివ్వలేదు, వెంటనే తీసేశారు. జేసీ బ్రదర్స్‌ను టార్గెట్ చేసినందుకు గోరంట్ల మాధవ్‌కు ఎంపీ సీటు ఇవ్వటంతో వీరందరూ ఆశ పడినట్లున్నారు. 2024లో మాధవ్‌ను కూడా తోసేశారు. సునీల్ నాయక్ ఈరోజు తప్పించుకోవచ్చు కానీ, కేసులో నుండి తీసేయటం కుదరదు. విచారణకు సహకరిస్తాను అని చెప్పి బెయిల్ తీసుకోవచ్చేమో కానీ, కేసును ఎదుర్కోక తప్పదు.
వైఎస్ కుటుంబ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్‌లను తమ లబ్ధి కోసం వాడుకోవటం మొదలైన తర్వాతే వారు కూడా క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా మారిపోయారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలక్ష్మి. 22 సంవత్సరాలకే ఐఏఎస్ అయ్యి, ఐఏఎస్ ఆఫీసర్‌గా డిపార్ట్‌మెంట్ తరఫున రికార్డులు పట్టుకుని హైకోర్టుకు వెళ్ళిన శ్రీలక్ష్మి, వైఎస్ ఆజ్ఞానుసారం చేసిన పనులకు అదే హైకోర్టుకు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. భారతదేశంలో ఒక అద్భుతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోవలసిన ఆమె తెలివితేటలు నిరుపయోగమైపోయాయి.
కులం, మతం అనే వాటిని మనం ఒక దుర్మార్గమైన పనో, ఒకరికి అన్యాయం చేసేటప్పుడో గుర్తుకు తెచ్చుకుంటే అలాంటి పనులు చేయకుండా ఆపుతాయి. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి, కానీ దుర్మార్గమైన పనులు చేయటానికి ఒప్పుకోనవసరం లేదు. బీవీఆర్‌ను నగ్నంగా వేలాడతీసి కొట్టేటప్పుడు, వీడియో తీసే ముందు, ఒక్కసారి బాల్యంలో గిరిపుత్రుడుగా ఎదుర్కొన్న ఇబ్బందుల్లో నుండి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో పొందిన గౌరవాన్ని తల్చుకుని ఉంటే... తనలాంటి వారినే ఇటువంటి దుర్మార్గపు పనులకు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని సునీల్ నాయక్ కు అవగతమయ్యేది.
అప్పుడు తన జాతికి ఒక మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంటుందని గుర్తుకు వచ్చేది. 140 కోట్ల జనాభాలో వేలల్లో మాత్రమే ఐపీఎస్, ఐఏఎస్‌లుగా దేశానికి సేవ చేసే అవకాశం పొందిన వారు దేశానికి వన్నె తీసుకురావటంతో పాటు, తమకు అవకాశం కల్పించిన తమ జాతికి వన్నె తీసుకురావాలి. అంతే కానీ, తాము చేసే తప్పులతో జాతి గౌరవానికి కళంకం తీసుకురాకూడదు..!