ప్రపంచం ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన చిచ్చు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా, గల్ఫ్ దేశాలకు వ్యాపిస్తోంది. అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ గల్ఫ్ రీజియన్‌పై కన్నేయడంతో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే, ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వేలాది మంది తెలుగు వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఢిల్లీలో కంట్రోల్ రూమ్.. ఏపీ సర్కార్ అప్రమత్తం!
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులను గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా మాతృభూమికి చేర్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు 0863-2340678 ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే, ఫోన్ కాల్ సాధ్యం కాని పక్షంలో +91 85000 27678 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తమ వివరాలను పంపవచ్చు లేదా helpline@apnrts.com ఈమెయిల్ ఐడి ద్వారా తమ పరిస్థితిని వివరించి ప్రభుత్వ సహాయం పొందవచ్చు. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఈ కంట్రోల్ రూమ్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బెహ్రెయిన్‌లోనే దాదాపు 50 వేల మందికి పైగా తెలుగు వారు ఉన్నట్లు అంచనా. వీరి కోసం ఏపీ ప్రభుత్వం నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) కోఆర్డినేటర్ల ద్వారా స్థానికంగా వసతి, ఆహార ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఏపీ ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లను ఆశ్రయించాలని సూచించారు.