సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ గల్లంతై, అటు పార్టీలోనూ, ఇటు నియోజకవర్గంలోనూ సెటిల్ కాలేకపోతున్న వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా.. ఇప్పుడు రూటు మార్చారు. ఏపీలో పప్పులు ఉడకడం లేదని గ్రహించారో ఏమో కానీ, పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ భజనలో తరించాలని ఫిక్స్ అయిపోయారు. స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో ఆమె చేసిన హంగామా చూస్తుంటే, ఇక్కడ సీన్ అయిపోయింది.. ఇక అక్కడైనా సెటిల్ అవుదాం అనే ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారని ఆకాశానికెత్తేస్తున్న రోజా.. అదే నోటితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై విషం కక్కడం చూసి జనం నవ్వుకుంటున్నారు. ``రోజాక్కా.. ఏపీలో మహిళలకు గడిచిన ఐదేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తుందా? మద్యం ధరలు పెంచి ఆడబిడ్డల తాళిబొట్లు తెంచిన పాపం మీది కాదా?`` అని సోషల్ మీడియాలో నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రజలు చీత్కరించి పక్కన పెడితే, తమిళనాడు వెళ్ళి నీతులు చెప్పడం అడ్రస్ లేని అమ్మాయి అత్తగారింట్లో పురాణం చదివినట్టు ఉంది.
తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం గొప్పగా ఉందంటున్న రోజా, ఏపీలో అదే పథకాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎందుకు కనిపించడం లేదు? ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాల్లో పడగానే విపక్షాలకు భయం పట్టుకుందని ఆమె వ్యాఖ్యానించడం మరో వింత. నిజానికి భయం పట్టుకుంది విపక్షాలకు కాదు.. ఏపీలో తన ఉనికి కోల్పోయి, రాజకీయ సన్యాసం దిశగా వెళ్తున్న రోజాకే అని నెటిజన్లు సెటైర్లు పేల్చడం కొసమెరుపు.
తమిళ ప్రజలు స్టాలిన్‌కి ఓటేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిస్తున్న రోజా.. ముందు నగరి ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయలేదో ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రయపడుతున్నారు. ఏపీలో రాజకీయాలు చేయడానికి ముఖం చెల్లక, పొరుగు రాష్ట్రంలో పొలిటికల్ టూరిజం చేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. అక్కడ మీరు ఎంత డబ్బా కొట్టినా.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో మీ ఇమేజ్ మాత్రం మారదని ప్రత్యర్థులు సైతం రోజాకు హితవు పలుకుతున్నారు.