కేశినేని చిన్ని Vs కొలికపూడి.. గుడిలో పట్టువస్త్రాల కోసం ఫైట్!

admin
Published by Admin — March 03, 2026 in Politics, Andhra
News Image

విజయవాడ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ అధిష్ఠానం ఎన్ని క్లాసులు తీసుకున్నా, ఎన్నిసార్లు హెచ్చరించినా వీరిద్దరి మధ్య దూరం తగ్గకపోగా.. అది ఏకంగా దైవ సన్నిధిలో ప్రొటోకాల్ యుద్ధానికి దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతున్న వేళ, నిబంధనల ప్రకారం ఆలయ పురోహితులు ఎంపీ కేశినేని చిన్ని దంపతులకు పట్టువస్త్రాలు అందజేశారు. సరిగ్గా అక్కడే అసలు సీన్ మొదలైంది. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఎమ్మెల్యే కొలికపూడి జీర్ణించుకోలేకపోయారు. తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వారు తలంబ్రాలు ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా, ఏకంగా ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ వస్త్రాలను తన తలపై పెట్టుకుని ఆయన వెళ్ళిపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

ఈ హఠాత్పరిణామంతో ఎంపీ చిన్ని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరును తప్పుబడుతూ వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అయితే, ఎంపీ చిన్ని పంతాలకు పోకుండా తన అనుచరులను వారించడంతో గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగింది. అయినప్పటికీ, కల్యాణ మండపంలో సీటింగ్ విషయంలోనూ అదే పంతం కొనసాగింది. ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు కూర్చోగా, ఎంపీ దంపతులు వెనుక వరుసకు పరిమితం కావాల్సి వచ్చింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. నియోజకవర్గాల్లో పర్యటనలు, అధికారిక కార్యక్రమాల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు పవిత్రమైన ఆలయంలో పట్టువస్త్రాల కోసం ఇలా బహిరంగంగా గొడవ పడటం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags
Kesineni Chinni Kolikapudi Srinivasa Rao TDP Nemali Temple AP Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News