ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకమైన చర్చ నడుస్తోంది.. అదే వారసుడి పట్టాభిషేకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న తరుణంలో, సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించబోతోందా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఆసక్తికర కథనాలు. ముఖ్యంగా వచ్చే ఉగాది పర్వదినం నాటికి రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు ఉంటాయని, చంద్రబాబు పార్టీ బాధ్యతలకు లేదా కేంద్ర రాజకీయాలకు పరిమితమై, లోకేష్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచినప్పటి నుండి లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐటీ, విద్యుత్ శాఖల్లో తనదైన ముద్ర వేస్తూ, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో `పప్పు` అని విమర్శించిన వారే ఇప్పుడు ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త రక్తం నింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందనేది ఒక వాదన. లోకేష్ కూడా పరిపాలనలో రాటుదేలుతుండటంతో, ఇదే సరైన సమయమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ మార్పు అంత సులువేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే వ్యూహాత్మక అడుగులు వేస్తున్న బీజేపీ ఈ నాయకత్వ మార్పును ఎలా స్వీకరిస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. పవన్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఒకవేళ లోకేష్ సీఎం అయితే, పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది? కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందా? అన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు, ఈ వార్తలన్నీ కేవలం ప్రత్యర్థుల మైండ్ గేమ్ అని టీడీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. చంద్రబాబు అనుభవం ఏపీకి ఇప్పుడు ఎంతో అవసరమని, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఆయనే సీఎంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. కూటమిలో చీలికలు తెచ్చేందుకే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం తన మంత్రి పదవికి పూర్తి న్యాయం చేస్తున్నారని, పదవుల కోసం ఆయనకు తొందర లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.