మేగజైన్ స్టోరీ: అమరావతి అసైన్డ్‌ రైతులకు సంపూర్ణ విముక్తి!

admin
Published by Admin — March 03, 2026 in Andhra
News Image

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన అసైన్డ్‌ రైతులకు సమస్యల నుంచి సంపూర్ణ విముక్తి లభించింది. సమస్యాత్మకంగా ఉన్న పాత పట్టాల స్థానంలో రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కొత్త సంవత్సరంలో కొత్తగా రిటర్నబుల్‌ ప్లాట్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. 2024లో అధికారంలోకి వచ్చింది మొదలు అసైన్డ్‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది.

ఇప్పటికే కౌలు బకాయిలు, సీఐడీ కేసుల సమస్యలను పరిష్కరించి అసైన్డ్‌ రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు వారికి రిటర్నబుల్‌ ప్లాట్లపై సంపూర్ణ హక్కులు కల్పించేలా కొత్త పట్టాల జారీకి సిద్ధమైంది. గతంలో ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లకు సంబంధించిన పట్టాల్లో ‘అసైన్డ్‌’ అనే పదాన్ని తొలగించేసింది.

అసైన్డ్‌ పదంతో అడ్డగోలు దోపిడీ..

రాజధాని అమరావతి కోసం 3,139 మంది అసైన్డ్‌ రైతులు 2,689.14 ఎకరాల భూములిచ్చారు. వీరికి సీఆర్‌డీఏ గతంలో ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్ల పట్టాలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వివరాలను తెలిపే చోట ‘అసైన్డ్‌’ అనే పదాన్ని పెట్టి వారికి ఆ పట్టాలిచ్చారు. ఆ పదాన్ని ఆసరా చేసుకుని దళారులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు.

గజానికి రూ.10 వేల నుంచి 20 వేలు తగ్గించి కొనుగోలు చేశారు. మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ అధికారును కలిసి ఎన్ని సార్లు రైతులు విజ్ఞప్తిచేసినా పట్టించుకున్నవారు లేరు. ఈ క్రమంలో రెండో విడత భూసమీకరణకు రైతులు ససేమిరా అన్నారు. మొదటి విడత భూసమీకరణ కింద ఇచ్చిన భూములకు రిటర్నబుల్‌ ప్లాట్లు, ఇతరత్రా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తేనే మళ్లీ భూసమీకరణకు సహకరిస్తామని తేల్చిచెప్పారు.

సమస్యల పరిష్కారానికి అధికారుల వద్దకు వెళ్తే తమను పురుగుల్లా చూస్తున్నారని.. సీఎం చంద్రబాబు తమకు అత్యంత గౌరవమిస్తుంటే.. వీరు తమను అవమానిస్తున్నారని.. ముఖ్యమంత్రి పిలిస్తే తప్ప ఇక చర్చలకు వచ్చేది లేదని ఖండితంగా చెప్పారు. క్షేత్ర స్థాయి వివరాలు తప్పించుకున్న చంద్రబాబు.. వారితో స్వయంగా సమావేశమై.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. రైతులకు ఇచ్చే పట్టాల్లో ‘అసైన్డ్‌’ పదం తొలగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో 187ను జారీ చేసింది.

ఆ జీవో ప్రకారం రైతులకు జారీ చేసిన పట్టాల్లో భూ సమీకరణ చట్టంలో 9.24లోని కాలం నంబర్‌ 7, రూల్‌ నంబర్‌ 11(4) క్లాజ్‌ను మార్చాలని సూచించింది.రిటర్నబుల్‌ ప్లాట్ల పట్టాదారులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టాలు జారీ చేయాలని ఆదేశించింది. అయితే జీవో అమలులో కొంత గందరగోళం నెలకొంది. కొత్తగా ఇచ్చే పట్టాలకే అలా చేస్తామని సీఆర్‌డీఏ అధికారులు మళ్లీ మెలికపెట్టారు. దీంతో అప్పటికే పట్టాలు పొందిన 95 శాతం మంది రైతులు విరుచుకుపడ్డారు. ఉద్యమానికి సిద్ధపడడంతో మళ్లీ సీఎం కలుగజేసుకున్నారు. వారికి పాత పట్టాల స్థానే కొత్త పట్టాలు ఇవ్వాలని స్పష్టంచేశారు.

ఒక్కో సమస్యకు పరిష్కారం..

రాజధాని కోసం అసైన్డ్‌ రైతులు ఇచ్చిన భూములపై గత వైసీపీ సీఐడీ విచారణ తంతు నడిపించి, వాటిని ‘నాట్‌ ట్యాలీడ్‌’ జాబితాలో పెట్టింది. ఆ కారణంగా 3,139 మంది రైతులు కష్టాలపాలయ్యారు. గత ప్రభుత్వం 8, 9, 10వ ఏడాదికి సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలును కూడా ఆపేసింది. దీంతో అసైన్డ్‌ రైతులు నరకం అనుభవించారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కొద్దినెలలు ఇదే పరిస్థితి కొనసాగింది.

రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో కళ్లు తెరచింది. వెంటనే ఆ సమస్యపై దృష్టి సారించింది. తొలుత రైతులకు సీఐడీ కేసుల నుంచి విముక్తి కల్పించింది. మూడేళ్ల కౌలు బకాయిలను రెండు దఫాల్లో మొత్తంగా చెల్లించింది. అయితే పట్టాల్లో ఉన్న అసైన్డ్‌ పదాన్ని ఆసరా చేసుకుని రైతులను దళారులు దోచుకున్నారు. ఆ పదం కారణంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల వద్ద కూడా ఆ పట్టాలు చెల్లుబాటయ్యే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ఇచ్చే కొత్త పట్టాలతో రైతులకు వారి ప్లాట్లపై మిగిలిన రైతులకు మాదిరిగానే అన్ని హక్కులు దఖలు పడనున్నాయి. దీంతో అసైన్డ్‌ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?

రాజధాని అమరావతిలో రెండో దశ భూసమీకరణ ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమాను, పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని యండ్రాయి గ్రామాల్లో రైతులు స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి నారాయణకు స్థానిక రైతులు భూసమీకరణ ఆమోద పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో పలు అనుమానాలు, ఆందోళనా వ్యక్తం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలివిడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులు పడిన కష్టాలను చూసిన వారు.. తమకు భద్రత కావాలని మంత్రిని కోరారు. అమరావతిలో తొలివిడత భూసమీకరణ కింద 2015లో  29వేల మంది రైతుల నుంచి 34వేల ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం సమీకరించింది. ఇప్పుడు మరో 20,494 ఎకరాల భూమిని రెండో విడత పూలింగ్‌లో సమీకరిస్తోంది. ఇందులో 16,666.57 ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మెజారిటీ రైతులు భూసమీకరణకు ముందుకొచ్చారు.

అయితే.. జగన్‌ ఐదేళ్ల హయాంలో రాజధాని నిర్మాణాన్ని ఆపేసి, ఐదేళ్లపాటు రైతులను అనేక రూపాల్లో ఇబ్బందులకు గురిచేసి, వార్షిక కౌలు చెల్లింపులు నిలిపేసి, రిటర్నబుల్‌ ప్లాట్ల అభివృద్ధిని నిలిపేసి వేధించిన తీరును వారు మంత్రి దగ్గర ప్రస్తావించారు. ఆ అనుభవాల నేపథ్యంలో తమకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మారితే తమ పరిస్థితేంటని అడిగారు.

ఎలాంటి ఇబ్బందీ కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తిచేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతోపాటు ఈ మూడేళ్లలోనే తమ ప్లాట్లను అభివృద్ధి చేసి అందించాలని కోరారు. రెండో దశ సమీకరణలో తీసుకునే భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేట్రాక్‌ నిర్మాణం, స్మార్ట్‌ పరిశ్రమలు, క్రీడా నగరం, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణానికి వినియోగించనున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడిస్తున్న వార్షిక కౌలు సరిపోదన్నారు. గతంలో జరీబు పొలానికి ఎకరానికి రూ. 50వేలు, మెట్ట పొలానికి ఎకరాకు రూ. 30 వేలు వార్షిక కౌలు చెల్లించారు. ప్రతి ఏటా 10 శాతం కౌలు పెంచి చెల్లించేవారు. ఇప్పుడు కూడా పది శాతమే పెంచితతే చాలదని.. మారిన పరిస్థితులు, ధరలకు అనుగుణంగా కౌలు పెంచి ఇవ్వాలని, ఏటా ఆ స్థాయిలో పెంపుదల ఉండాలని అభ్యర్థించారు. దీనిని మంత్రి నారాయణ వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాజధాని రైతుల పంట రుణాలను రూ.లక్షన్నర వరకూ మాఫీ చేస్తామని మంత్రి చేసిన ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాగా రెండో దఫా పూలింగులో సమీకరించే భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేట్రాక్‌ నిర్మాణం, స్మార్ట్‌ పరిశ్రమలు, క్రీడా నగరం, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణానికి వినియోగిస్తారు.

Tags
Magazine story amaravati assigned lands Amaravati Farmers permanent relief
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News