మేగజైన్ స్టోరీ: ‘లడ్డూ’ గుట్టు రట్టు!

admin
Published by Admin — March 03, 2026 in Andhra
News Image

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిలో భయం కనిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందేమోనన్న ఆందోళనతో ఆయన విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కల్తీ నెయ్యి అని తెలిసీ సరఫరాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన  అప్పటి/ఇప్పటి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌పై చంద్రబాబు ప్రభుత్వం బదిలీ వేటు వేయడం.. టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై క్రిమినల్‌ చర్యలు చేపడతారేమోనన్న భయంతో జగన్‌ మైండ్‌ బ్లాక్‌ అయింది.

అందుకే.. అబద్ధాల సృష్టిలో పీహెచ్‌డీ చేసిన ఆయన.. జగన్మోహన్‌రెడ్డి,, మరో అసత్యాన్ని అలవోకగా జనం మీదకు వదిలారు. లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఆయన ఏ మాత్రం పశ్చాత్తాపం చెందడం లేదు. ఆయన ముఠా అంతా కలిసి వివిధ రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసిందని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చినా.. ఆ విషయాన్ని పక్కనపడేసి.. పందికొవ్వు లేదని తేల్చిందంటూ ఆయన కొత్త రాగం అందుకున్నారు.

సీఎం చంద్రబాబు గత ఏడాది పందికొవ్వు ఉందన్నారని.. అది లేదని సిట్‌ నిర్ధారించిందని.. అందుచేత ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. తన చిన్నాన్న నుంచి టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారుల వరకు పాపాలు చేశారని రుజువైతే.. దాని నుంచి జనం దృష్టి మళ్లించేందుకు చంద్రబాబును టార్గెట్‌ చేశారు. వైసీపీ నేతలు వితండవాదం చేస్తున్నారని ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో అంబటి రాంబాబుతో సీఎంను బూతులు తిట్టించి.. అందరూ అటు చూసేలా డైవర్షన్‌ రాజకీయాలకు తెరలేపారు.

తన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు చేసి.. కల్తీ నెయ్యి అని తేలినా అవే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చిన అప్పటి, ఇప్పటి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌పై సీఎం వేటు వేసేటప్పటికి.. జగన్‌ బిత్తరపోయారు. తన చిన్నాన్న దాకా రాకుండా ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు.

ఎదుటివారిపై విషం చిమ్మడమే నైజం

పాపభీతి ఏ మాత్రం జగన్‌కు.. ఎదుటవారిపై విషం కక్కడం వెన్నతో పెట్టిన విద్య. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని సీఎం చంద్రబాబు వెలుగులోకి తీసుకురాగానే.. జగన్‌ స్పందన చూసి ప్రజలు నోరెళ్లబెట్టారు. ఆవుకు ఆరోగ్యం బాగోకపోతే.. అది ఇచ్చే పాలు కొంచెం అటూఇటుగా ఉంటాయట! పాలల్లో జంతువుల కొవ్వు ఉంటుందని, అదేం తప్పుకాదని ఆయన మొండివాదనకు దిగారు.

అసలది ఆవు నెయ్యే కాదని.. రసాయనాలతో చేసిందని సిట్‌ తేల్చడంతో దానిని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అన్నారని.. కొవ్వు లేదని సిట్‌ తేల్చిదంటూ తప్పుడు సమాచారాన్ని జగన్‌ జనం మీదకు వదిలారు. జగన్‌ జమానాలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందన్నది ఎవరు..? ఇప్పుడు లేదన్నది ఎవరు..? అసలు లేదన్నారా.. ఇంకేమన్నారు..? వీటితో ప్రజలకు పనిలేదన్నది జగన్‌ ఉద్దేశం. నెయ్యి కల్తీపై ఏ సంస్థ ఏం చెప్పిదంటే...

ఎన్‌డీడీబీ-కాఫ్‌..

‘ఎన్‌డీడీబీ-కాఫ్‌’.. జాతీయ స్థాయిలో అత్యంత గుర్తింపు పొందిన, ప్రతిభావంతమైన పరిశోధనా కేంద్రం. దేశవ్యాప్తంగా పాల డెయిరీలపై అజమాయిషీ చేసే జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డుకు అనుబంధంగా 2009లోనే ఏర్పాటైన రీసెర్చ్‌ సెంటర్‌ ఇది. పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి.. నిర్ధారించడంలో జాతీయ స్థాయిలో దీనికి మించిన వ్యవస్థ మరోటి లేదు. టీటీడీ 2024 జూలైలో స్వాధీనం చేసుకున్న రెండు నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్‌ను ఎన్‌డీడీబీ-కాఫ్‌కే పంపించింది.

ఇందులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో ధ్రువీకరించింది. ఆ విషయాన్నే అప్పుడు సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అయితే దీనిపై మరో ఏజెన్సీకి కూడా టీటీడీ నెయ్యి శాంపిల్స్‌ పంపించింది. నెయ్యిలో పందికొవ్వు కలిసిందో లేదో చెప్పాలని ఐసీఏఆర్‌-నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే సంస్థను కోరింది. శాంపిల్‌ తీసిన మొత్తం తక్కువగా ఉన్నందున సదరు సంస్థ పంది కొవ్వు ఆనవాళ్లు కనిపించలేదని.. ఇతర జంతువుల కొవ్వు, చేప నూనె ఉందో.. లేదో.. నిర్ధారించే సాంకేతికత తమ వద్ద లేదని తెలిపింది.

ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టుకు సమర్పించిన లేఖలో సృష్టంగా పేర్కొంది. తమది అంత ప్రామాణికమైన వ్యవస్థ కాదని, కేవలం అంతర్గత పరిశీలనలో టెస్టింగ్‌ నివేదికలు మాత్రమే ఇస్తామని, థర్డ్‌ పార్టీ నిర్ధారణ కూడా చేయలేదని తెలిపింది. అంటే ఆ సంస్థ పరీక్షించి ఇచ్చిన నివేదికలో శాస్త్రీయత లేదనే అర్థం. జంతువుల కొవ్వు ఉందో లేదో పరిశీలించేందుకు తమ వద్ద సాంకేతికత లేదని కూడా స్పష్టంచేసింది.

జంతువుల కొవ్వును పరీక్షించే సామర్థ్యం తమకు లేదని ఐసీఏఆర్‌ తేల్చాక.. పది కొవ్వు లేదంటూ అది చెప్పిన ఒక్క మాటను పట్టుకుని కొవ్వే లేదని జనాలను మభ్యపెట్టడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారు. దేశంలోనే అత్యంత పెద్దది.. ప్రామాణిక సంస్థ అయిన ఎన్‌డీడీబీ-కాఫ్‌ ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఇచ్చిన నివేదికలను ఆయన ఉద్దేశపూర్వకంగా పక్కనపడేశారు. తన హయాంలో జరిగి ప్రతి నేరాన్నీ కప్పిపుచ్చినట్లుగానే శ్రీవారి పట్ల చేసిన అపచారానికి కూడా మసిపూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
చార్జిషీటులో సంచలన నిజాలు

తిరుమల లడ్డూ నాణ్యతపై వచ్చిన ఆరోపణల్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్‌ ఏడాది పాటు జరిపిన దర్యాప్తులో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, డెయిరీ నిపుణులు, లాజిస్టిక్‌ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్‌వర్క్‌ గొలుసును 12 రాష్ట్రాల్లో పర్యటించి వెలికితీసింది. సుదీర్ఘ దర్యాప్తులో తేల్చిన అంశాలపై చార్జిషీటును ఇటీవల నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలుచేసింది. ఐదు రాష్ట్రాల్లో విస్తరించిన అక్రమ, కల్తీ కార్యకలాపాలను అందులో స్పష్టంగా పేర్కొంది.

టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో వివరించింది. నిజమైన ఆవు నెయ్యి కిలో రూ.319.80కు సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిపింది. జగన్‌ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి 2019 నుంచి 23 వరకు నాలుగేళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన సారథ్యంలోని బోర్డు సిఫారసులతో 2020 జనవరిలో ప్రొపెషనల్‌ కమిటీ ఏర్పాటు చేసి టెండర్‌ నిబంధనల్లో ఎక్కువ మంది పాల్గొనేలా సడలింపులు ఇచ్చారు. అందులో రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ నిబంధన తొలగించారు.

డెయిరీ నిర్వహణ అనుభవం మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారు. వార్షిక టర్నోవర్‌ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించడంతో.. సహకార డెయిరీలకు టెండర్లు దక్కకుండా చిన్న డెయిరీలు రంగంలోకి దిగాయి. పాలు సేకరించని, కనీస అనుభవం లేని డెయిరీలు టెండర్లలో పాల్గొనడంతో టీటీడీకి సరఫరాచేసే నెయ్యి నాణ్యత పడిపోయింది. భక్తులు నిరసన తెలిపారు. అయితే కరోనా మహమ్మారి రావడంతో దీనినెవరూ పట్టించుకోలేదు. కరోనా సద్దుమణిగాక మళ్లీ భక్తులు గళమెత్తారు.

ఏడాదిపాటు నిష్ర్కియగా వ్యవహరించిన బోర్డు.. నిబంధనల సడలింపుపై 2023 నవంబరులో సమీక్షించింది (అప్పుడు భూమన కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నారు). చిన్న డెయిరీల నెయ్యి వల్లే లడ్డూ నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు పెరిగాయని.. కల్తీలేని నెయ్యి కోసం నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే ఏఆర్‌ డెయిరీ నుంచి కల్తీ నెయ్యి సరఫరా కొనసాగడంతో.. వాటిని పరీక్షించినప్పుడు ప్రాథమిక నివేదికల్లో జంతువుల కొవ్వు కలిసిందని తేలింది. అదే విషయాన్ని చంద్రబాబు నాడే క్యాబినెట్‌ సమావేశంలో ప్రస్తావించారు. నిజానిజాల నిర్ధారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.

దీనిపై శ్రీవారి భక్తులు రగిలిపోయారు. జగన్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కొందరు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ జరుగుతుండగానే.. దొంగే దొంగ అన్నట్లుగా వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. చంద్రబాబుపై ఫిర్యాదుచేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడివడిన అంశం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర సిట్‌ను కాకుండా.. సీబీఐ పర్యవేక్షణలో వేరే సిట్‌ వేసింది. సీబీఐ, రాష్ట్రప్రభుత్వం నుంచి ఇద్దరేసి సీనియర్‌ అధికారులు, భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీనియర్‌ అధికారిని ఇందులో నియమించారు. రాష్ట్ర సిట్‌లో ఉన్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి ఈ సిట్‌లోనూ ఉండడం విశేషం.

భోలేబాబా గోల్‌మాల్‌..

లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ సిట్‌.. 2024 జూన్‌, జూలైల్లో నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలు వెలుగులోకి రావడంతో నమూనాలను ఎన్‌డీడీబీ ప్రయోగశాలకు పంపడంతో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. యూపీలోని భగవాన్‌ పూర్‌లోని భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు పోమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌(ఏ4)లతో పాటు సారిక జైన్‌(ఏ 21), పూనమ్‌ జైన్‌(ఏ22).. 2019-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరాకు కొందరు టీటీడీ అధికారులు, స్థానిక డెయిరీలతో కలిసి క్రిమినల్‌ కుట్రకు పాల్పడినట్లు సిట్‌ తేల్చింది.

కుట్రలో భాగంగా కల్తీ నెయ్యి తయారు చేయాలనే దురుద్దేశంతో తమ సంస్థలైన హర్ష ట్రేడింగ్‌ కంపెనీ, హర్ష ఫ్రెష్‌ డైయిరీ ఫుడ్స్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన బుజే బుజే రిఫైనరీస్‌ లిమిటెడ్‌, మరికొన్ని సంస్థల నుంచి పామోలిన్‌ కొనుగోలు చేశారు. అదే విధంగా అరిస్టో కెమికల్స్‌ నుంచి ఫుడ్‌ గ్రేడ్‌ లాస్టిక్‌ యాసిడ్‌, సుగంఽధ్‌ ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌, శివాన్షీ ట్రేడింగ్‌ కంపెనీ, జీఆర్‌ ఇంప్లెక్స్‌ నుంచి అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌, మోనో గ్లిసరైడ్స్‌ వంటి రసాయనాలు, బీటా క్యారోటిన్‌ వంటి నెయ్యి ఫ్లేవర్‌ను సేకరించారు.

ఇందులో కీలక ఉద్యోగులైన హరి మోహన్‌ రాణా(ఏ12), సంజయ్‌ చౌహాన్‌ (ఏ13), ఆశిష్‌ రోహిల్లా(ఏ14)తో కలిసి పాలు లేదా వెన్న సేకరించకుండానే భగవాన్‌ పూర్‌లోని భోలేబాబా డెయిరీలో రిఫైన్డ్‌ పామాయిల్‌, కర్నెల్‌ ఆయిల్‌, రిఫైన్డ్‌ ఓలీన్‌ను అతి తక్కువ పరిమాణంలో ఉన్న నెయ్యితో కలిపి, ల్యాబ్‌ పరీక్షల్ని మేనేజ్‌ చేసేందుకు, సువాసన నిలిపేందుకు బీటా క్యారోటిన్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌, ఫుడ్‌ గ్రేడ్‌ లాక్టిక్‌ యాసిడ్‌, మోనోగ్లిసరైడ్‌, నెయ్యి ప్లేవర్‌ వంటి రసాయనాలు ఉపయోగించి నెయ్యి లాంటిది తయారు చేసినట్లు సిట్‌ పేర్కొంది.

సదరు నెయ్యిలో నెయ్యి ప్రమాణం చాలా తక్కువగా ఉందని 2025 మార్చి 27న గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ-కాఫ్‌ ధ్రువీకరించింది. భోలేబాబా డెయిరీలో  68 లక్షల కిలోలకు పైగా కెమికల్‌ నెయ్యి తయారుచేసినట్లు సిట్‌ ఆధారాలతో సహా తేల్చింది. ఈ కుట్ర అమలులో భాగంగా టీటీడీ నెయ్యి టెండర్లకు అర్హులు కాక పోయినా తప్పుడు పత్రాలు సమర్పించి టెండర్లలో పాల్గొన్నట్లు తెలిపింది. పామిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, అపూర్వ చావ్డా, శ్రీ వైష్ణవీ డెయిరీ, రాజేష్‌ మన్సుఖ్‌ లాల్‌ చావ్డా, మచింద శాంతారామ్‌, రాజు రాజశేఖరన్‌లు గ్రూపుగా ఏర్పడి కుట్ర చేసినట్లు పేర్కొంది.

భోలేబాబా డైరెక్టర్లతో పాటు అజయ్‌ కుమార్‌ సుగంధ్‌, మహేష్‌ రోహిరా రసాయనాలతో రిఫైన్డ్‌ పామాయిల్‌, కర్నెల్‌ ఆయిల్‌, పామ్‌ ఓలిన్‌ను కొబ్బరి నూనెగా చూపుతూ తప్పుడు ఇన్వాయిస్‌లు చూపారు. రవీంద్ర శర్మ(ఏ 23) కూడా కుట్రలో పాల్గొని నెయ్యి పరీక్ష నివేదికల్ని తారుమారు చేసి ల్యాబ్‌ రిపోర్టులు సృష్టించాడు. టీటీడీ ప్లాంట్‌ ఇన్‌స్పెక్షన్‌ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి సరైన తనిఖీలు చేయకుండా తప్పుడు నివేదికలు సమర్పించారు.ఫలితంగా నాణ్యతలేని 60 లక్షల కిలోలకుపైగా నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. టీటీడీకి సుమారు రూ.235 కోట్లు నష్టం కలిగించారు. అంతకుమించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని సిట్‌ తన చార్జిషీటులో స్పష్టంచేసింది.

సుబ్బారెడ్డి పీఏ ముడుపుల బాగోతం..

టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కుందూరు చిన్నప్పన్న(ఏ 24) డెయిరీల నుంచి కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్‌ చేయగా సరఫరాదారులు నిరాకరించడంతో టెండర్‌ అర్హతను ప్రభావితం చేశాడని సిట్‌ తేల్చింది. అనంతరం మరో సంస్థకు అధిక రేటుకు టెండర్‌ ఇప్పించి రూ.50 లక్షలు తీసుకున్నట్లు తేలింది. సుబ్బారెడ్డికి తెలియకుండా చిన్నప్పన్న ఇంత పనిచేయగలడా అనేది సందేహాస్పదం. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ చేసేందుకు కెమికల్స్‌ను తినదగినవిగా చూపిస్తూ అజయ్‌ కుమార్‌ సుగంధ్‌, మహేష్‌ కుమార్‌ రోహిరా తప్పుడు మార్గంలో నెయ్యి తయారీ కుట్రలో భాగస్వాములయ్యారు.

ఏ-16 అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ నుంచి ఏ 36 జయరాజ్‌ వరకూ నిందితులందరూ సాక్ష్యాల్ని నాశనం చేయడం, నెయ్యి కల్తీ చేయడం, హనికరమైన ఆహార పదార్థాలు విక్రయం, నమ్మక ద్రోహం, టీటీడీకి నష్టం కలిగేలా తెలిసి మోసం చేయడం, నకిలీ పత్రాల తయారీ, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభావితం చేయడం, వాణిజ్య సంస్థల ద్వారా అనుచిత లబ్ది పొందడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడ్డారు.

వైష్ణవీ డెయిరీ, మాల్‌గంగా వంటి డెయిరీ సంస్థలు కూడా కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆగ్‌ మార్క్‌ ఆవునెయ్యిగా సరఫరా చేశాయి. సృష్టించిన నకిలీ పత్రాల్లో కొందరు నిందితుల చేతిరాత, సంతకాలు డిజిటల్‌ ఫోరెన్సిక్‌లో బయట పడ్డాయి. ఖాళీ రశీదులను ముందే వాట్సాప్‌లో పంపడం, ఒకే వాహన నెంబర్లు పదే పదే సరఫరాలో చూపడం.. సరుకు తరలించకుండానే రికార్డులు సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది. ఫోన్‌ ట్యాగ్‌ డేటా, మొబైల్‌ లోకేషన్‌ వివరాలు సైతం తప్పులను పసిగట్టాయి.

చార్జిషీట్‌లో పేర్కొన్న ప్రయోగ శాల నివేదిక ప్రకారం బ్యూటరిక్‌ ఆమ్లం పరిమాణం తక్కువగా ఉండటం వల్ల నిజమైన పాల కొవ్వు బాగా తక్కువగా ఉందని.. బీటా సిటోస్టెరాల్‌ అనే వృక్ష స్టెరాల్‌ ఉనికితో ఈ నమూనాల్లో పామాయిల్‌, పామ్‌ స్టిరిన్‌, పామ్‌ కర్నెల్‌ మిశ్రమం ఉన్నట్లు నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. డబ్బు మొత్తం హవాలా మార్గంలో బ్యాంకుల బయట ఢిల్లీ, గ్వాలియర్‌, బీకనేర్‌, ఘాజియాబాద్‌, సహరాన్‌పూర్‌, విజయవాడ, హైదరాబాద్‌లోని మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరిగినట్లు డిజిటల్‌ ఆధారాలను కోర్టుకు సమర్పించింది.

ప్రతి ట్యాంకర్‌ నెయ్యి సరఫరా నుంచి కమీషన్‌ తీసుకున్నారని, టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ విభాగాల సిబ్బంది ఇందులో ఉన్నారని వెల్లడించింది. నిందితుల మధ్య సంభాషణలు, చాటింగ్‌ తదితర ఆధారాలు తొలగించినా డిజిటల్‌ ఫోరెన్సిక్‌ వెలికితీసిందంటూ సుమారు 500 ఆధారాలు సమర్పించింది. ఇన్ని వివరాలు బయటకు రావడం.. తన ప్రభుత్వ నిర్వాకం బయటపడడంతో జగన్‌ ఆందోళన చెందుతున్నారు. అంబటి రాంబాబును ముందుపెట్టి తాను ఆడిన నాటకం బయటపడడం.. ఇదే సమయంలో టీటీడీ ఈవో సింఘాల్‌ను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేయడంతో.. తర్వాతి టార్గెట్‌ తన చిన్నాన్న అవుతారేమోనని ఆయన భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Tags
Laddu adulteration facts revealed ex cm jagan ttd ex chairman yv subbareddy
Recent Comments
Leave a Comment

Related News