‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు అల్లు అర్జున్. ప్రభాస్ తర్వాత దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నది బన్నీకే. ఈ విషయంలో బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా దిగదుడుపే అంటే అతిశయోక్తి కాదు. ‘పుష్ప-2’ ఆకాశమంత ఎత్తుకు చేరిన తన ఇమేజ్‌ను మ్యాచ్ చేసేలా ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో ఎంతో ఆలోచించి, ఆల్రెడీ అనుకున్న త్రివిక్రమ్ చిత్రాన్ని పక్కన పెట్టి మరీ.. అట్లీతో జట్టు కట్టాడు ఐకాన్ స్టార్. ‘పుష్ప-2’ రిలీజై 15 నెలలు కావస్తుండగా.. ఇంకా ఈ సినిమా నుంచి ఏ విశేషాన్నీ టీం పంచుకోలేదు.
షూట్ మొదలు కావడానికి ముందు ప్రిపరేషన్‌కు సంబంధించి చిన్న వీడియో ఏదో వదిలి, సినిమాను అనౌన్స్ చేయడం తప్పితే.. సినిమా నుంచి ఏ చిన్న విశేషమూ ఇంకా బయటికి రాలేదు. ఐతే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు నాడు మాత్రం ట్రీట్ కొంచెం గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంకో అయిదు వారాల్లో బన్నీ దేశవ్యాప్తంగా ఫిలిం సర్కిల్స్‌లో ప్రకంపనలు రేపడం ఖాయమని చెన్నై వర్గాల టాక్. ఇప్పటికే అట్లీ ఆ రోజు రిలీజ్ చేయబోయే గ్లింప్స్ తాలూకు విజువల్స్ కొన్ని సన్నిహితులకు చూపించాడట. అందులో కొందరు మీడియా వాళ్లు కూడా ఉన్నారట. వాళ్లు ఆ విజువల్స్, అందులో చూపించిన ప్రపంచం.. వాడిన టెక్నాలజీ గురించి ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో హైప్ ఇస్తున్నారు.
ఒక ట్రూ హాలీవుడ్ సినిమా చూడబోతున్న సంకేతాలను ఈ గ్లింప్స్ ఇస్తుందని.. ఒక స్టన్నింగ్ లుక్‌తో బన్నీ షాకిస్తాడని అంటున్నారు. ఆ గ్లింప్స్ రిలీజైనపుడు దేశమంతా దాని గురించి మాట్లాడుకుంటుందని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం పలు హాలీవుడ్ స్టూడియోల టెక్నీషియన్లు పని చేస్తున్నారు. కొత్త టెక్నాలజీలను ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోయే సినిమాగా దీన్ని చెబుతున్నారు. సన్ పిక్చర్స్ వాళ్లు రూ.800 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ కూడా ఓ కీలక పాత్ర చేస్తోంది. బన్నీ ఇందులో పలు అవతారాల్లో కనిపిస్తాడని సమాచారం.