ఇరాన్‌తో వార్.. అమెరికా చేస్తున్న ఖర్చు తెలిస్తే షాకే!

admin
Published by Admin — March 04, 2026 in International
News Image

ప్రస్తుతం పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్(Iran-Israel) మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా మెడకు చుట్టుకుంది. తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను కాపాడుకోవడానికి రంగంలోకి దిగిన అమెరికాకు.. ఊహించని స్థాయిలో ఆర్థిక దెబ్బ తగులుతోంది. కేవలం యుద్ధ ట్యాంకులు, విమానాలు కదలడమే కాదు, అక్కడ పడుతున్న ప్రతి అడుగుకూ అగ్రరాజ్యం వేల కోట్లు కుమ్మరించాల్సి వస్తోంది.

యుద్ధం అంటే కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక విధ్వంసం అని అమెరికా(America) ఖర్చు చూస్తే అర్థమవుతోంది. విశ్వసనీయ నివేదికల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. మన భారతీయ కరెన్సీలో లెక్కగడితే ఇది సుమారు 6,900 కోట్ల రూపాయలు. అంటే ఒక్క రోజులోనే ఒక చిన్న దేశం బడ్జెట్ అంత మొత్తాన్ని అమెరికా యుద్ధం కోసం వాడేసింది.

గాల్లో తేలాలన్నా.. నీళ్లలో కదలాలన్నా కోట్లే!
అమెరికా తన యుద్ధ నౌకలను, విమాన వాహక నౌకలను (Aircraft Carriers) పర్యవేక్షించడం కోసం భారీగా వెచ్చిస్తోంది. `సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ` డేటా ప్రకారం.. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి భారీ నౌకలను ఆపరేట్ చేయడానికి రోజుకు 58 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. కేవలం యుద్ధ సామాగ్రిని, ఎయిర్‌క్రాఫ్ట్‌లను యుద్ధ క్షేత్రానికి తరలించేందుకే 5,556 కోట్ల రూపాయలను (630 మిలియన్ డాలర్లు) కేటాయించింది.

ఈ యుద్ధం ఇక్కడితో అయినా ఆగుతుందా అంటే.. నిపుణులు కాదు అనే చెబుతున్నారు. పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ కెంట్ స్మెట్టర్స్ అంచనా ప్రకారం, ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాపై 210 బిలియన్ డాలర్ల భారం పడనుంది. మన దేశ కరెన్సీలో ఇది దాదాపు 18.87 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటికే హమాస్‌తో యుద్ధం వల్ల నష్టపోయిన ఇజ్రాయెల్‌కు 2023లో అమెరికా 21.7 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఇప్పుడు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగడంతో అగ్రరాజ్యం పరిస్థితి ``ముందు నుయ్యి.. వెనుక గొయ్యి``లా మారింది. యుద్ధం వల్ల ఆయుధ కంపెనీలు లాభపడుతున్నా, అమెరికా సామాన్య పౌరుడి పన్ను డబ్బు మాత్రం పశ్చిమాసియా మంటల్లో బూడిదవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఆర్థిక భారాన్ని మోస్తూ అమెరికా ఎంతకాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలవగలదో చూడాలి.

Tags
Iran Israel War USA Middle East Conflict War News Iran Attack Israel Under Fire
Recent Comments
Leave a Comment

Related News