పావలా శ్యామలకు బ‌న్నీ భరోసా.. నెలకు ఎంత‌ ఇస్తున్నారంటే?

admin
Published by Admin — March 04, 2026 in Movies
News Image

వెండితెరపై తనదైన నటనతో, హాస్యంతో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల. వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఆ నవ్వుల వెనుక ఇప్పుడు నిస్సహాయత దాగుంది. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆమె పోరాడుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించి, ఆమె జీవితంలో కొత్త వెలుగులు నింపారు.

గత కొంతకాలంగా పావలా శ్యామల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సికింద్రాబాద్‌లోని ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెకు, తన అనారోగ్యంతో పాటు కూతురి వైద్య ఖర్చులు మోయలేని భారంగా మారాయి. కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్న ఆమె దీనగాథ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బ‌న్నీ.. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, ఆమెకు శాశ్వత భరోసా కల్పించే దిశగా అడుగులు వేశారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఒకేసారి కొంత మొత్తం ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకుంటారు. కానీ బన్నీ అలా చేయలేదు. పావలా శ్యామల, ఆమె కుమార్తె కనీస అవసరాలు తీరాలనే ఉద్దేశంతో ప్రతి నెలా రూ. 10,000 ఆమె ఖాతాలో పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మందుల ఖర్చులు, నిత్యవసరాల కోసం ఈ మొత్తం ఆమెకు కొండంత అండగా నిలవనుంది. తాత్కాలిక సాయం కంటే ఇలాంటి రెగ్యులర్ సపోర్ట్ ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇస్తోంది.

మొత్తానికి రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ చాటుకున్న ఈ మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్న తోటి కళాకారుడికి ఇచ్చే అతిపెద్ద గౌరవం డబ్బు మాత్రమే కాదు, మేమున్నాం అనే ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇస్తూ అల్లు అర్జున్ చేసిన ఈ పనికి టాలీవుడ్ మొత్తం ఫిదా అవుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఆమెను ఆదుకున్నప్పటికీ, బన్నీ తీసుకున్న ఈ మంత్లీ సపోర్ట్ నిర్ణయం మ‌రింత అద్భుతంగా ఉంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Tags
Allu Arjun Actress Pavala Syamala Icon Star Tollywood Humanity Pavala Syamala
Recent Comments
Leave a Comment

Related News