ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అమరావతి నుంచి ఢిల్లీ వైపు మళ్లింది. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇప్పుడు అసలైన పదవుల పంపిణీ పర్వం మొదలైంది. ముఖ్యంగా రాజ్యసభ సీట్ల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో తన పార్టీకి ఖచ్చితమైన వాటా ఉండాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక సీట్ల గురించి చర్చలు జరుగుతుంటాయి. కానీ, పవన్ కళ్యాణ్ ఈసారి రూట్ మార్చారు. జూన్‌లో ఖాళీ అయ్యే సీట్ల కోసం ఇప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేశారట. గతంలో రాజ్యసభ సీటు విషయంలో జరిగిన సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన జెండాను పార్లమెంటు ఎగువ సభలో ఎగురవేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇటీవల జరిగిన భేటీలో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఈ సీటును తన అన్నయ్య నాగబాబు కోసం ఆశిస్తున్నారా? లేక పార్టీ కోసం తెరవెనుక చక్రం తిప్పుతున్న మరో కీలక నేతను ఢిల్లీకి పంపిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం.. పవన్ ఎంపిక చేయబోయే వ్యక్తి అటు జనసేనకు విధేయుడుగా ఉంటూనే, ఇటు చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితుడై ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కూటమిలో ఎలాంటి విభేదాలు రాకుండా స్మూత్‌గా సీటును దక్కించుకునే పక్కా ప్లాన్ ఇదని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో సీట్ల పంపిణీ సమయంలో లెక్కల మాస్టారిగా వ్యవహరించిన చంద్రబాబు, ఈసారి పవన్ కోరికను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. జనసేన త్యాగాలను గుర్తించి గౌరవప్రదమైన సీటు ఇస్తారా? లేక మళ్ళీ పాత లెక్కలనే తెరపైకి తెస్తారా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, రాజ్యసభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఇప్పుడే అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడటం కూటమి రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.