వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్‌గా ఉన్న కేడర్‌లో జోష్ నింపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ల కంటే సీనియర్ల అనుభవమే పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జగన్ ఒక ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలి కాలంలో పార్టీలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అనారోగ్యం కారణంగా యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. ఈ లోటును పూడ్చడంతో పాటు, కూటమి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ధర్మాన లాంటి వాగ్ధాటి, వ్యూహ ప్రతిభ ఉన్న నేత అవసరమని జగన్ భావిస్తున్నారు. అందుకే గత రెండ్రోజుల క్రితం ధర్మానతో జగన్ నేరుగా ఫోన్లో గంటకు పైగా మాట్లాడినట్లు సమాచారం. కేవలం కుశలప్రశ్నలే కాకుండా, పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ధర్మాన సలహాలను జగన్ అడిగి తెలుసుకున్నారట.
ఈ చర్చల్లో భాగంగా ధర్మాన ముందు జగన్ ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేయడంతో పాటు, పార్టీ అధికారంలోకి వస్తే ధర్మాన ప్రసాదరావుకు రాజ్యసభ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ప్రతిగా ఒక కండిషన్ కూడా పెట్టారట. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలను స్వీకరించి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ధర్మాన భుజానికెత్తుకోవాలని జగన్ కోరినట్లు సమాచారం.

ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ఇంటికే పరిమితమైన ధర్మాన, ఒకానొక దశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో తిరిగి వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్‌కు ధర్మాన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరి రాష్ట్ర సమన్వయకర్తగా ధర్మాన ఎంట్రీ ఇస్తే వైసీపీలో కొత్త జవజీవాలు రావడం ఖాయమేనా? ఉత్తరాంధ్ర కోటను మళ్ళీ జగన్ వశం చేసేందుకు ధర్మాన వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయి? రాష్ట్ర రాజకీయాల్లో ఈ మార్పు ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.