అల్లు వారింట పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అల్లు శిరీష్ తన చిరకాల ప్రేయసి నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు నెల రోజుల ముందు నుంచే శిరీష్ పెళ్లి సందడి స్టార్ట్ అయింది. జనవరి ఎండింగ్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు శిరీష్ మరియు నయనికల కోసం దుబాయ్‌లో ఒక గ్రాండ్ యాచ్ పార్టీని హోస్ట్ చేశారు. మార్చి 1న శిరీష్‌ను పెళ్లి కొడుకును చేసే సాంప్రదాయ వేడుక అల్లు వారి నివాసంలో ఘనంగా జరిగింది. మార్చి 2న హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం ఒక భారీ రిసెప్షన్ వేడుక జరిగింది.
మార్చి 6న కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్ - నయనికల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి క్యూట్ లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి శిరీష్, నయనికలమధ్య ప్రేమ చిగురించడానికి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రధాన కారణమని మీకు తెలుసా? ఒకరి పెళ్లి సందడి, మరొకరి పార్టీ వేడుక.. ఈ రెండూ కలిపి శిరీష్ జీవితంలోకి నయనికను తీసుకొచ్చాయి.
ఈ ప్రేమకథకు అసలు బీజం పడింది 2023 అక్టోబర్‌లో. అది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల పెళ్లి సమయం. ఆ వేడుకల సందడిలో భాగంగా, హీరో నితిన్ మరియు అతని భార్య శాలిని కందుకూరి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీనే శిరీష్ జీవితాన్ని మలుపు తిప్పింది. శాలిని తన క్లోజ్ ఫ్రెండ్ నయనికను ఆ పార్టీకి ఆహ్వానించారు. అక్కడే శిరీష్ కళ్లు నయనికపై పడ్డాయి.
నితిన్ దంపతులు ఏర్పాటు చేసిన ఆ స్నేహపూర్వక వాతావరణంలో శిరీష్, నయనికల మధ్య మాటలు కలిశాయి. ఆ చిన్న పరిచయం కాస్తా స్నేహంగా మారి, గత రెండేళ్లుగా అత్యంత రహస్యంగా ప్రేమగా బలపడింది. ``వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల సమయంలో మా ప్రయాణం మొదలైంది`` అని శిరీష్ స్వయంగా వెల్లడించడంతో, ఈ ప్రేమ వెనుక ఉన్న ఆ ఇద్దరు స్టార్ హీరోల (వరుణ్ తేజ్, నితిన్) పాత్ర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.