ఇప్పుడు కోర్టు.. రేపు జడ్జిని కూడా మార్చ‌మంటారా ఆర్కే..?

admin
Published by Admin — March 06, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో ప్రత్యర్థులపై కేసులు వేయడం ఒక ఎత్తు అయితే, ఆ కేసులను నిరూపించలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయడం మరో ఎత్తు. సరిగ్గా ఇదే బాటలో పయనిస్తున్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు అంటూ ఆర్భాటంగా ఫిర్యాదు చేసినప్పుడు ఉన్న ఉత్సాహం.. ఇప్పుడు సాక్ష్యాలు చూపించమంటే మాత్రం కన్పించడం లేదు. దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే, సమాధానం చెప్పాల్సింది పోయి.. ఏకంగా కోర్టునే మార్చండి అంటూ ఆర్కే వేస్తున్న పిటిషన్లు చూస్తుంటే, న్యాయవ్యవస్థతో ఆయన చేస్తున్న పింగ్ పాంగ్ ఆట స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్ రెడ్డి హయాంలో ఈ కేసును ఏసీబీ కోర్టులో విచారిస్తున్నప్పుడు ఆర్కేకి ఎలాంటి అభ్యంతరం కలగలేదు. అప్పుడు లేని ప్రజా ప్రతినిధుల కోర్టుప్రేమ ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? అంటే, ఏసీబీ కోర్టులో విచారణ జరిగితే అసలు రంగు బయటపడుతుందన్న భయమా? లేక సాక్ష్యాలు లేవని తేలిపోతుందన్న ఆందోళనా? కోర్టు ప్రొసీజర్లు తెలిసిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఇలాంటి సిల్లీ పిటిషన్లతో న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించాలని చూడటం ప్రజాస్వామ్యానికే విడ్డూరం. ఇవాళ కోర్టు మార్చమంటున్నారు.. రేపు తనకి అనుకూలంగా లేకపోతే జడ్జిని కూడా మార్చమంటారేమో అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆర్కే దగ్గర గట్టిగా ఒక సాక్ష్యం ఉంటే ఈపాటికే కోర్టులో ధీమాగా వాదించేవారు. కానీ, చేతిలో చిల్లిగవ్వంత సాక్ష్యం కూడా లేకపోవడంతో, పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కేసును నీరుగార్చడమే ఆయన అసలు ఉద్దేశంలా కనిపిస్తోంది. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు కొట్టివేతకు గురికాకుండా, ఏదో రకంగా కోర్టుల్లో నానుతూ ఉండాలనేదే ఈ కోర్టుల మార్పిడి వ్యూహం. అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి, ఇప్పుడు ఆధారాలు అడిగితే కోర్టు అడ్రస్ మార్చమంటున్న ఆర్కే తీరు.. గ్రౌండ్ సరిగ్గా లేదని బ్యాట్ విరగ్గొట్టుకున్న ఆటగాడిలా ఉంది.

Tags
Alla Ramakrishna Reddy RK AP Politics Chandrababu Naidu Andhra Pradesh TDP YSRCP
Recent Comments
Leave a Comment

Related News