రాజకీయాల్లో ఓటమి అనేది సహజం, కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకోకపోవడమే అసలైన ప్రమాదం. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో కేవలం 11 స్థానాలకు పరిమితమైనప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన స్తబ్దత ఆవరించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల(AP Local Body Elections) ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లోని ఆందోళనను మరింత పెంచాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా వాస్తవాలను గుర్తిస్తారా?
సాధారణంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు సిద్ధమవుతారు. కానీ వైసీపీ(YCP)లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోందని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుండటంతో, ఎవరికి వారు సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, కొందరు నేతలు అధికార కూటమి నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారనే వార్తలు పార్టీ క్యాడర్‌ను మరింత గందరగోళంలోకి నెట్టేశాయి.
పార్టీలో ఇంతటి గందరగోళం నెలకొనడానికి ప్రధాన కారణం నిర్ణయాధికారంలో ఉన్న లోపాలేనని పలువురు సీనియర్ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధినేత చుట్టూ ఉన్న ఒక కోటరీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చాయని, మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ కీలక వ్యక్తులకే జగన్(Jagan) ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు బయట రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కోవాల్సిన సమయంలో, సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రగలడం వైసీపీకి పెద్ద సవాలుగా మారింది. కేవలం విమర్శలకు పరిమితం కాకుండా, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఇప్పటికైనా జగన్(Jagan) తన చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించి, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పార్టీలో ప్రక్షాళన చేస్తారా? లేక పాత పంథాలోనే కొనసాగుతారా? అన్నది రాబోయే రోజుల్లో ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది.