ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం అంటేనే బొత్స సత్యనారాయణ కుటుంబం గుర్తుకు వస్తుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా గజపతినగరంలో బొత్స సత్యనారాయణ రాజకీయాలు సాగిస్తున్నారు. ఇక్కడ ఒక రకంగా ఆయన ప్రభావం, పేరు కూడా పాతుకు పోయాయనే చర్చ రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు అన్నట్టుగా ఇప్పుడు గజపతినగరంలో నాయకులతో పాటు రాజకీయాలు కూడా పూర్తిస్థాయిలో మారిపోయాయి. గత ఎన్నికల్లో టిడిపి తరఫున విజయం దక్కించుకున్న యువ నాయకుడు, ఉన్నత విద్యావంతుడు కొండపల్లి శ్రీనివాస్ మార్పు దిశగా వేసిన అడుగులు ఫలిస్తున్నాయి.
గజపతినగరం రాజకీయాల్లో కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైన నియోజకవర్గంలో ఇప్పుడు పారిశ్రామికంగానే కాకుండా అభివృద్ధి పరంగా కూడా అడుగులు వేసేలా నిర్ణయాలు సాగుతున్నాయి. రాజకీయ విమర్శలు లేవు, వివాదాలకు అంతకన్నా చోటు లేకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు గజపతినగరం అనగానే రాజకీయంగా వివాదాలకు కేంద్రంగా మారేదని, సవాళ్లు ప్రతి సవాళ్లు వినిపించేవని.. ముఖ్యంగా అవినీతి ఎక్కువగా సాగిందని కూడా అప్పట్లో అనేక విశ్లేషణలు అనేక విమర్శలు కూడా వచ్చాయి.
కానీ, గడిచిన 20 మాసాలుగా గజపతినగరం నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు అనే మాటే ఎక్కడా వినిపించకుండా అభివృద్ధి దిశగా నియోజకవర్గం పయనిస్తోందన్న వాదన వినిపించడం ఆశ్చర్యం కలిగించక మానదు. కానీ ఇది వాస్తవమని స్థానికంగా ఉన్న నాయకులు చెబుతున్నారు. వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ నిపుణుడైన కొండపల్లి శ్రీనివాస్ గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. టిడిపి తరఫున తొలిసారి ఆయన అవకాశం దక్కించుకొని పోటీ చేశారు. వాస్తవానికి రాజకీయ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ మధ్యలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. శ్రీనివాస్ తాతయ్య కొండపల్లి పైడితల్లి నాయుడు మూడుసార్లు బొబ్బిలి పార్లమెంటు సభ్యునిగా విజయం దక్కించుకున్నారు.

ఆ తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ ప్రజలను ఆకర్షించడంలోనూ ప్రజల తరఫున పనిచేయడంలోనూ కొండపల్లి శ్రీనివాస్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఇచ్చిన హామీ మేరకు ఆయన అభివృద్ధి పనులను కూడా పట్టాలెక్కించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు, యువతకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా మంత్రిగా తనదైన శైలిని చూపిస్తున్నారు. నియోజకవర్గానికి దూరం అవుతున్నారన్న వాదన ఎక్కడ వినిపించకుండా తరచుగా నియోజకవర్గంలో పర్యటించటం, సమస్యలను తెలుసుకోవడం ప్రజలకు అందుబాటులో ఉండడం కొండపల్లి శ్రీనివాస్ కు కలిసి వస్తున్నాయి.
ప్రధానంగా ఒకప్పుడు బొత్స సత్యనారాయణ వేసిన రాజకీయ అడుగులకు భిన్నంగా ఇప్పుడు రాజకీయం అంటే ప్రజల అభివృద్ధి, వారి ఆర్థిక సమస్యల పరిష్కారం అనే కొత్త కోణాన్ని జోడించి కొండపల్లి శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. దీంతో వైసిపిలో కానీ ఇటు బొత్స ఫ్యామిలీలో కానీ ఎక్కడ మంత్రిపై విమర్శలు చేసే పరిస్థితి కానీ, మంత్రిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేసే అవకాశం కానీ కనిపించకపోవడం విశేషమనే చెప్పాలి. ఈ తరహా వాతావరణం విజయనగరంలో తొలిసారి అని పరిశీలకులు చెబుతున్నారు. ఒకప్పుడు గజపతినగరం అంటేనే రాజకీయ విమర్శలకు వివాదాలకు కేంద్రంగా ఉండేదని అంటున్నారు.
కానీ కొండపల్లి శ్రీనివాస్ ఆ పరిస్థితులు మార్చేస్తున్నారని మెజారిటీ రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తో ఉన్న సాన్నిహిత్యం, మంత్రి నారా లోకేష్ దగ్గర ఉన్న చనువు వంటివి కొండపల్లి శ్రీనివాస్ కి కలిసి వస్తున్నాయి. దీంతో ఆయన అభివృద్ధి పనులను వేగంగా చేయడంతో పాటు తన శాఖ తరపున కూడా ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ఇక బొత్స ఫ్యామిలీ రాజకీయాలు గజపతినగరంలో ముగిసినట్టేనన్న చర్చలు కూడా లోకల్గా వినిపిస్తున్నాయి.