అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఇద్దరు పిల్లలు ముద్దు అనే పాత నినాదం కనుమరుగు కానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును చూసి ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం, జనాభా సమతుల్యతను కాపాడేందుకు `సరికొత్త జనాభా నిర్వహణ విధానం` (Population Management Policy) ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మూడో బిడ్డను కనే దంపతులకు కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కొత్త పాలసీ ప్రకారం, మూడో బిడ్డను కనే దంపతులకు ప్రభుత్వం రూ. 25,000 ప్రోత్సాహకం అందించనుంది. ముసాయిదా పాలసీ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) వెల్లడిస్తూ మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం అందించనున్నట్లు తెలిపారు. అంటే పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకు ఆ బిడ్డ బాధ్యతలో కొంత భాగాన్ని ప్రభుత్వమే భుజానికెత్తుకోనుంది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో, మూడో బిడ్డకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
దీనికి తోడు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు వెసులుబాటు కల్పించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఇతరులకు కూడా వర్తించేలా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు (TFR) 1.5 కి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జపాన్, ఇటలీ దేశాల్లో లాగా యువత తగ్గిపోయి, వృద్ధుల జనాభా పెరిగిపోతుందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ముసలి ఏపీగా మారకూడదంటే, TFR రేటును కనీసం 2.1కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే పాత ఫ్యామిలీ ప్లానింగ్ స్థానంలో కొత్తగా పాపులేషన్ కేర్ విధానాన్ని తీసుకువచ్చారు.
పిల్లలు లేని వారికి సైతం అండగా..
సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పీపీపీ పద్ధతిలో అత్యాధునిక IVF (సంతాన సాఫల్య) సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని అనే ఐదు సూత్రాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవనుంది. మార్చి నెలాఖరుకు ఈ పాలసీని ఖరారు చేసి, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది.