ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కూటమి ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు, నాయకుల మధ్య విభేదాలపై ఆయన సీరియస్ అయ్యారు. ``ఎవరికి వారు తామే బలవంతులమని భ్రమపడొద్దు.. అసలు 2019లో ఎందుకు ఓడిపోయామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి`` అంటూ వేయాల్సిన చురకలు అంటించారు. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం ఆవరించింది.
గెలిచిన కొద్దిరోజులకే కొందరు నేతల్లో అధికార గర్వం కనిపిస్తోందని, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తిరువూరు, సత్తెనపల్లి, సత్యవేడు, గుడివాడ వంటి ప్రాంతాల్లో తమ్ముళ్ల మధ్యే తగాదాలు నడుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది పనిచేయడానికే కానీ, ఆధిపత్య పోరు కోసం కాదని తేల్చి చెప్పారు. తామే గొప్ప నేతలమని భావించే వారికి, గత ఎన్నికల ఓటమిని గుర్తు చేస్తూ రియాలిటీ చెక్ ఇచ్చారు.
ముగ్గురం కలిస్తేనే ఈ విజయం!
కూటమి విజయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నేతలకు సూటిగా వివరించారు చంద్రబాబు. ``నేను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ.. ఈ ముగ్గురి కలయికను చూసి ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకంతోనే మనకు ఓట్లు వేశారు. ఈ ముగ్గురిలో ఎవరు విడిపోయినా ఫలితం మరోలా ఉండేది`` అని స్పష్టం చేశారు. నాయకులు తమ వ్యక్తిగత ఇమేజ్ కంటే కూటమి ధర్మాన్ని కాపాడటం ముఖ్యమని, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సఖ్యత లేకపోతే అది తీవ్ర నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.
వచ్చే ఐదేళ్లు ప్రజల కోసం కష్టపడితేనే భవిష్యత్తు ఉంటుందని, లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని పరోక్షంగా హెచ్చరించారు. ``మేము ముగ్గురం ప్రజలకు మరింత చేరువ అవుతున్నాం.. మీరు మాత్రం కింద కొట్టుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మీకే నష్టం`` అంటూ ఎమ్మెల్యేల తీరుపై అసెంబ్లీ సాక్షిగా క్లాస్ తీసుకున్నారు. మరి ఈ హెచ్చరికతోనైనా వివాదాస్పద నియోజకవర్గాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.