బెల్లంకొండ వారసుడి పెళ్లి సందడి.. ఎవరీ కావ్య రెడ్డి?

admin
Published by Admin — March 08, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి బాజాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస పెళ్లిళ్లతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొనగా, ఇప్పుడు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడు, మెగా మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ, ఒక ఇంటివాడు కావడానికి సిద్ధమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న ప్రేయ‌సి కావ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా నెటిజన్ల దృష్టి కావ్య రెడ్డి పై పడింది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈమెకు గ్లామర్ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. కావ్య రెడ్డి ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబం నుండి వచ్చిన యువతి. ఆమె తాతగారు గతంలో గౌరవనీయమైన జడ్జిగా పనిచేశారని, తండ్రి ప్రముఖ లాయర్ అని తెలుస్తోంది.

సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల పరిచయం వెనుక ఒక ఆసక్తికరమైన ప్రేమకథ ఉందనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో ఇప్పుడు మూడు ముళ్ల బంధానికి సిద్ధమయ్యారని సమాచారం. నిశ్చితార్థ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడలతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వృత్తిపరంగా చూస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీని తర్వాత ఆయన చేతిలో `టైసన్ నాయుడు`, `హైందవ`, `రామం` వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కెరీర్ సక్సెస్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అడుగు వేస్తున్న ఈ హీరోకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags
Bellamkonda Sai Sreenivas Kavya Reddy Tollywood Weddings Bellamkonda Sreenivas Engagement
Recent Comments
Leave a Comment

Related News