రాజోలు వైసీపీలో ముసలం.. ఆ సీనియర్ నేతకు జగన్ షాక్!

admin
Published by Admin — March 08, 2026 in Politics, Andhra
News Image

రాజోలు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ(YCP) అధిష్టానం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నియోజకవర్గంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత గొల్లపల్లి సూర్యరావును కాదని.. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవిని రాజోలు వైసీపీ సమన్వయకర్తగా రంగంలోకి దించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి గొల్లపల్లి సూర్యరావు(Gollapalli Surya Rao) వంటి ఉద్దండుడిని పదవి నుంచి తప్పించడం వెనుక జగన్ వేసిన పొలిటికల్ స్కెచ్ చాలా లోతుగా ఉందని అర్థమవుతోంది. గొల్లపల్లి కుమార్తె తెలుగుదేశం పార్టీ రాజోలు ఇంచార్జ్ గా ఉండటం, రేపు ఎన్నికల బరిలో ఆమెతో తలపడాల్సి రావడమే ఈ మార్పుకు ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది. సొంత కూతురే ప్రత్యర్థి క్యాంపులో ఉంటే.. పార్టీ వ్యూహాలు ఎలా వర్కవుట్ అవుతాయి? అన్న అనుమానమే గొల్లపల్లి పాలిట శాపంగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఇదే త‌రుణంలో ఆయనను సాగనంపుతూ ఇచ్చిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) పదవి కేవలం కంటితుడుపు చర్యేనని అంటున్నారు. సాధారణంగా వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్‌కు ఎండ్ కార్డ్ వేయాలనుకున్న నేతలకు ఇచ్చే సెండ్-ఆఫ్ గిఫ్ట్ ఈ పీఏసీ పదవి. మొత్తానికి అలా గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి పార్టీ కోసం పనిచేసిన గొల్లపల్లికి, జ‌గ‌న్ ఊహించిన షాకిచ్చారు.

మరోవైపు, జనసేన నుండి వైసీపీలోకి వచ్చిన పాముల రాజేశ్వరి దేవి(Pamula Rajeswari Devi)కి లక్ చిక్కింది. గతంలో పి.గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమెకు నియోజకవర్గంపై పట్టు ఉన్నప్పటికీ, రాజోలులో ఆమె ఏ మేరకు నెట్టుకొస్తారనేది ప్రశ్నార్థకమే. ఒకవైపు మహిళా నాయకత్వానికి పెద్దపీట వేశామని పార్టీ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, లోకల్ కేడర్ మాత్రం అసంతృప్తితో రగిలిపోతోంది. ఇన్నాళ్లూ గొల్లపల్లి వెంటే నడిచిన అనుచరులు, ఇప్పుడు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే కూటమి హవా నడుస్తున్న రాజోలులో, సొంత పార్టీలోనే ఈ రకమైన ముసలం పుట్టడం వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ కొత్త మార్పు వైసీపీకి బూస్ట్ ఇస్తుందా లేక ఉన్న పునాదులను కదిలిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. 

Tags
Razole Politics YSRCP YS Jagan Gollapalli Surya Rao Pamula Rajeswari AP Politics
Recent Comments
Leave a Comment

Related News