అమరావతి: ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, సమాజంలో మారుతున్న కుటుంబ పోకడలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు సరికొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కేవలం పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం కుటుంబాలు విడిపోవడం నాగరికతకే గొడ్డలిపెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదుగురు ఉంటే ట్రిపుల్ బెడ్రూం ఇల్లు!
ఈ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రకటించిన అత్యంత కీలకమైన హామీ `ట్రిపుల్ బెడ్రూం` ఇళ్లు. ఏ కుటుంబంలోనైతే ఐదు లేదా ఆరుగురు సభ్యులు కలిసి ఉంటారో, వారందరికీ ప్రభుత్వం తరపున ఉచితంగా మూడు గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని బాబు ప్రకటించారు. చిన్న ఇళ్లలో అందరూ కలిసి ఉండలేక విడిపోవాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది పేద, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబాలకు కొండంత అండగా నిలవనుంది.
రేషన్ నుంచి పెన్షన్ వరకు.. అన్నీ డబుల్!
ఇక ఉమ్మడి కుటుంబాల్లోని వృద్ధులకు భరోసా కల్పిస్తూ అదనపు పెన్షన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా, రేషన్ విషయంలోనూ సంచలన మార్పులు చేయనున్నారు. ఒకే కుటుంబంలో 10 మంది వరకు సభ్యులు కలిసి ఉంటే, వారికి నెలకు ఏకంగా 60 కేజీల వరకు ఉచిత రేషన్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రేషన్ కోసమే విడిపోవాల్సిన అవసరం ఇకపై ఎవరికీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
నేటి కాలంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయడం లేదా వారు ఒంటరిగా మిగిలిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి ఉన్న అసలైన సంపద ఉమ్మడి కుటుంబాలేనని, వాటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహకాలు కుటుంబాలను మళ్ళీ దగ్గర చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధివిధానాలను అధికారికంగా విడుదల చేస్తామని సీఎం బాబు తన ప్రసంగంలో వెల్లడించారు.