శివాజీ ఆన్ ఫైర్‌.. జ‌గ‌న్ కు మాస్ వార్నింగ్..!

admin
Published by Admin — March 09, 2026 in Politics, Movies
News Image

నటుడు శివాజీ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. గతంలో `ఆపరేషన్ గరుడ`తో సంచలనం సృష్టించిన ఆయన, తాజాగా విడుదల చేసిన వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, తన సినిమాలపై వస్తున్న నెగెటివ్ రివ్యూలపై మండిపడుతూనే, నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ``జగన్ గారు.. నా జోలికి రావద్దు, నాకు రాజకీయాలు వద్దు`` అంటూనే ఆయన ఇచ్చిన హెచ్చరిక మాస్ వార్నింగ్‌ను తలపిస్తోంది.

సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న వారిపై శివాజీ ఉగ్రరూపం దాల్చారు. కనీసం వంద మంది సబ్‌స్క్రైబర్లు కూడా లేని యూట్యూబ్ ఛానెళ్లు తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నాయని, దీని వెనుక ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న `పేటీఎం బ్యాచ్` కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ``అరేయ్ పేటీఎం బ్యాచ్.. నన్ను తగులుకుంటే అది మీకే ప్రమాదకరం, నా పని నేను చేసుకుంటుంటే కావాలని కెలుకుతున్నారు`` అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. తన సినిమాలు విడుదల కాకముందే పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇప్పిస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూనే, ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తానని శివాజీ పునరుద్ఘాటించారు. ముఖ్యంగా అమరావతి రైతుల పక్షాన నిలబడతానని, వారి న్యాయం కోసం ఏ పార్టీపైనైనా పోరాడతానని చెప్పారు. అవసరమైతే ఈ విషయంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా నిలదీస్తానని అనడం ఆయన తెగింపును చాటుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ వంటి వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే, ముందుగా కేసులు ఉన్న రాజకీయ నాయకులపై విచారణను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కూడా తనపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని, కానీ తాను ఎవరికీ తలవంచలేదని శివాజీ గుర్తు చేశారు. ``అధికారంలో ఉన్నవారే నన్ను ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు ఈ చిల్లర ట్రోల్స్ నన్ను ఏం చేస్తాయి?`` అని ప్రశ్నించారు. నిజాయతీగా బతుకుతున్న తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, దీనిపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Tags
Actor Sivaji YS Jagan Mohan Reddy YSRCP Ap News Ap Politics Tollywood
Recent Comments
Leave a Comment

Related News