వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. మొన్నటివరకు అమరావతి భూముల వ్యవహారం, దాడుల కేసుల్లో చిక్కుకుని జైలుకెళ్లొచ్చిన ఆయనకు, ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈసారి ఏకంగా ఓ చర్చి ట్రస్ట్‌ను పునరుద్ధరిస్తానని నమ్మబలికి, భారీ మొత్తంలో నగదు వసూలు చేశారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. సుమారు రూ. 25 లక్షల వ్యవహారంలో ఆయనపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. కాకినాడకు చెందిన సీబీఎన్సీ (CBNC) చర్చి ట్రస్ట్ సభ్యులు 2021లో తమ ట్రస్ట్ రెన్యువల్ పనుల కోసం అప్పటి ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ను సంప్రదించారు. అధికార పార్టీలో కీలక నేతగా ఉండటంతో తమ పని సులువుగా పూర్తవుతుందని వారు భావించారు. అయితే, ఇదే అదనుగా భావించిన సురేష్.. ఆ పని పూర్తి చేసేందుకు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఎంపీ మాట నమ్మి బాధితులు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసంలోనే ఆ నగదును అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోవడంతో బాధితులకు అనుమానం మొదలైంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని వారు పలుమార్లు సురేష్‌ను కోరగా, ఆయన నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని సమాచారం. డబ్బులు ఇవ్వకపోగా, తమను తీవ్రంగా బెదిరింపులకు గురిచేశారని ట్రస్ట్ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు విజయవాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం బాగోతం వెలుగులోకి వచ్చింది.
బాధితుడి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. మాజీ ఎంపీపై సెక్షన్ 318(4) (చీటింగ్), 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన సురేష్‌కు, ఈ కొత్త చీటింగ్ కేసు అడ్డం తిరిగేలా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపు లేకుండా సాగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.