ఇక మీరు చ‌నిపోవ‌చ్చు.. సుప్రీం సంచ‌ల‌న తీర్పు..!

admin
Published by Admin — March 11, 2026 in National
News Image

కన్నబిడ్డ కళ్లముందే ఉన్నా మాట్లాడలేని స్థితి.. శవంలా పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. చివరకు వారి వేదనను గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ``ఇక చాలు.. ఆ జీవచ్ఛవానికి విముక్తి ప్రసాదించండి`` అంటూ హరీశ్ రాణా కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు చదివే సమయంలో స్వయంగా న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా భావోద్వేగానికి లోనవ్వడం ఈ కేసులోని గాఢతను తెలియజేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరీశ్ రాణా కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో, హాస్టల్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడటంతో అతని జీవితం ఒక్కసారిగా చీకటిమయమైపోయింది. తలకు తగిలిన తీవ్ర గాయం అతడిని కోమాలోకి నెట్టేసింది. అప్పటి నుండి నేటి వరకు అంటే దాదాపు 13 ఏళ్లుగా హరీశ్ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, కేవలం ట్యూబుల ద్వారా అందుతున్న ఆహారం, శ్వాసతోనే ప్రాణాలు నిలుపుకున్నాడు.

తమ కొడుకు కోలుకునే అవకాశం లేదని తేలిపోవడంతో, ఆర్థికంగానూ, మానసికంగానూ చితికిపోయిన ఆ తల్లిదండ్రులు చివరకు కారుణ్య మరణం(Passive Euthanasia) కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైనా, సుప్రీంకోర్టు మాత్రం మానవీయ కోణంలో ఆలోచించింది. మెడికల్ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం, హరీశ్‌కు అందుతున్న చికిత్సను నిలిపివేసి, అతనికి గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కును కల్పించింది.

2018లో కారుణ్య మరణానికి చట్టబద్ధత కల్పించిన తర్వాత, దేశంలో పరోక్ష కారుణ్య మరణానికి అనుమతి లభించిన తొలి కేసుగా హరీశ్ రాణా కేసు చరిత్రలో నిలిచిపోనుంది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. ఒక మనిషికి కేవలం బతికే హక్కు మాత్రమే కాదు, నరకయాతన అనుభవిస్తున్నప్పుడు గౌరవంగా కన్నుమూసే హక్కు కూడా ఉంటుందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

Tags
Harish Rana Passive Euthanasia Supreme Court Right To Die India News India
Recent Comments
Leave a Comment

Related News