అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే వరాలు ప్రకటించారు. కేవలం పండుగ శుభాకాంక్షలతో సరిపెట్టకుండా, వేల కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేలా సామూహిక గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేశారు.
తెలుగువారి కొత్త ఏడాది ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల మంది లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. కేవలం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా, పారదర్శకమైన పద్ధతిలో అర్హులైన ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
సామాన్యులకు మరో ఊరటనిచ్చే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ‘ట్రూఅప్’ ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరిచారని విమర్శిస్తూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ భారాన్ని తగ్గించేలా ‘ట్రూడౌన్’ విధానాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో సాంకేతికతను, సమర్థవంతమైన నిర్వహణను ఉపయోగించి విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించి సామాన్యుడి జేబుకు ఉపశమనం కలిగించే హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు `2047 స్వర్ణాంధ్ర విజన్` పేరుతో ఒక భారీ ప్రణాళికను ముఖ్యమంత్రి సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రూపొందించిన 10 సూత్రాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిటకు చేర్చాలని, పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, వాటిని దీర్ఘకాలిక ప్రయోజనాలతో అనుసంధానించడమే తన మార్క్ పాలన అని చంద్రబాబు ఈ సమావేశం ద్వారా మరోసారి నిరూపించారు.