అవకాశం వచ్చింది.. పైనుంచి అనుమతులు కూడా ఉన్నాయి.. మీకెందుకు చేసేయండి! అంటూ.. భరో సా ఇచ్చే నాయకులు కూడా కలిసి వచ్చారు. అంతేకాదు.. ``ఇంతేనా.. మరింత!`` టార్గెట్లు పెట్టి మరీ దోపిడీని పెంచి పోషించిన వారు వున్నారు. ఇంకేముంది.. సదరు అధికారులు వారికి `అంత` పెట్టి.. తాను `ఇంత` తినేశారు!!. తాజాగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్ మెంటు డైరెక్టరేట్(ఈడీ)(ED) అధికారులు.. నాడు.. ఏపీ ఎక్సైజ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన వాసుదేవ రెడ్డి(vasudeva reddy)ని విచారించింది.
ఈ క్రమంలో పలు కీలక విషయాలను ఈడీ అధికారులు గుర్తించారు. మద్యం కుంభకోణానికి(liquor scam) సంబంధించి న కీలక ప్లాన్‌లో వాసుదేవ రెడ్డి పాత్ర ఉందని తెలిపారు. అదేవిధంగా మద్యం తయారీ నుంచి సరఫరా వరకు అన్ని వేళల్లోనూ.. ఎంత మేరకు ఆయా కంపెనీల నుంచి కమీషన్లు అందుకోవాలన్న వ్యూహంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ క్రమంలోనే మొత్తం 3500 కోట్ల రూపాయలకు పైగానే సొమ్మును దోచుకున్నారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిలో మెజారిటీ పార్టును.. `కీలక నాయ కులు`.. మరికొందరు కీలక వ్యక్తులు పంచుకున్నారని గుర్తించారు.
ఇక.. అంత మంది దోచుకున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి సైతం ఊరుకుంటారా? అంతేకాదు.. అసలు వారి దోపిడీకి స్కెచ్ వేసిందే.. ఆయన(ఈడీ చెబుతున్నట్టుగా) కాబట్టి.. వారికి వేల కోట్ల రూపాయల దోపిడీ మార్గాన్ని అన్వేషించి పెట్టింది కూడా.. ఆయనే కాబట్టి.. తానుకూడా కొంత మేరకు వెనుకేసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తం 95 కోట్ల రూపాయలకు పైగానే తన బావమరిది, భార్య పేరుతో పెట్టినట్టు తెలుసుకున్నారు. 3500 కోట్లరూపాయల కుంభకోణంలో ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ, అవినీతి సొమ్ము కాబట్టి.. వారికి అంత పంచి.. ఈయన ఇంత జేబులో వేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఆర్డర్ కావాలా.. అడిగిందివ్వాలి!
వాసుదేవరెడ్డి.. నాటి ఎక్సైజ్ శాఖలో కీలక ఎండీ స్థానంలో ఉండడంతో ఆయన సంతకం లేకుండా.. ఏ కంపెనీ నుంచి మద్యం కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఇదే ఆయనకు కలిసి వచ్చింది. ``మీ కంపెనీ నుంచి ఇన్ని కేసుల మద్యం కొనేందుకు ఆర్డర్ ఇస్తాం.. మరి మాకేంటి?`` అని నేరుగా బేరాలు పెట్టేశారని.. ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్డర్ కావాలా.. అడిగిందివ్వాలన్న విధంగా అడుగులు ముందుకు వేసినట్టు తెలిపారు. ఒక్కొక్క కేసుకు 70 రూపాయల చొప్పున(రోజుకు వేల కేసుల్లో వ్యాపారం సాగుతుంది.) వసూలు చేసి.. తన కుటుంబ సభ్యుల ఖాతాల్లో వేసుకున్నట్టు తెలిపారు. ఎలా చూసినా.. పెద్దలు అంత తింటే.. వాసుదేవరెడ్డి ఇంత తిన్నారని స్పష్టం చేశారు.