వైసీపీ వేడుకల్లో వింత దృశ్యం.. జగన్ `షాడో` ఎక్క‌డ‌?

admin
Published by Admin — March 12, 2026 in Politics, Andhra
News Image

వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు తాడేపల్లిలో ముగిశాయి. అయితే ఇవి వేడుకల్లా ఉన్నాయా లేక ఏదో మొక్కుబడి కార్యక్రమంలా జరిగాయా అన్నది పక్కన పెడితే.. అక్కడ కనిపించిన ఒక దృశ్యం మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లకు ఫుల్ మీల్స్ పెడుతోంది. గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి షాడోలా, పార్టీకి సర్వస్వంలా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈసారి ఫ్రేమ్‌లో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు అసలైన విశేషం.

సాధారణంగా తాడేపల్లి పార్టీ ఆఫీసులో చీమ చిటుక్కుమన్నా సజ్జల పర్మిషన్ ఉండాల్సిందే. జగన్ జెండా ఎగురవేస్తుంటే ఆయన వెనకో, పక్కనో ఉండి అన్నీ తానై నడిపించే సజ్జల.. ఈ ఆవిర్భావ వేడుకల్లో మాత్రం మిస్సింగ్. ఎన్నికల ఫలితాల షాక్ తర్వాత వ్యూహకర్తలు మారారో లేక జగన్ రెడ్డి పక్కన తన ప్లేస్ మారిందో తెలియదు కానీ, సజ్జల గైర్హాజరు మాత్రం పార్టీ శ్రేణుల్లో రకరకాల అనుమానాలకు తావిస్తోంది. సలహాలు ఇచ్చే వారు లేకనా.. లేక ఇచ్చిన సలహాలు పని చేయకనా? అంటూ క్యాడర్ లోపల గట్టిగానే చర్చించుకుంటున్నారు.

ఒకప్పుడు జగన్ పక్కన నిలబడి ఫోటోలకు పోజులు ఇవ్వడానికి పోటీ పడే మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారో వెతుక్కోవాల్సిన పరిస్థితి. జగన్ పక్కన ఈసారి దేవినేని అవినాష్‌తో పాటు ముక్కూ మొహం తెలియని కొంతమంది నేతలు మాత్రమే కనిపించడం చూస్తుంటే.. పార్టీలో పాత తరం ముఖం చాటేసిందా లేక జగన్ వారందరినీ పక్కన పెట్టేసారా? అన్నది అర్థం కావడం లేదు. ఒకప్పుడు హడావుడి చేసిన నేతలంతా ఇప్పుడు తాడేపల్లి వైపు చూడటానికే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

పార్టీ ఆవిర్భావం అంటే క్యాడర్‌లో జోష్ నింపాలి.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఏదో జెండా ఎగురవేశామా, ఫోటోలు దిగామా అన్నట్లుగా వేడుకలు నిస్సారంగా సాగాయి. చెల్లాచెదురైన పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన జగన్ టీమ్.. కనీసం కీలక నేతలను కూడా ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురాలేకపోవడం గమనార్హం.

Tags
YSRCP YS Jagan YSRCP Formation Day Tadepalli AP Politics Andhra Pradesh Sajjala Ramakrishna Reddy
Recent Comments
Leave a Comment

Related News