అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా సామాన్యుడిని వేధిస్తున్న గ్యాస్ సరఫరా సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వంటింట్లో మంట పుట్టిస్తున్న గ్యాస్ కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు శనివారం ఉదయం మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని శక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు.
గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం ముగ్గురు కీలక మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని రంగంలోకి దించింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. నేడు ఉదయం 11:30 గంటలకు సివిల్ సప్లై భవనంలో భేటీ కానున్న ఈ కమిటీ, గ్యాస్ సరఫరాను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఒక కార్యాచరణను రూపొందించనుంది.
రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతను కేవలం స్థానిక సమస్యగా చూడకుండా, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ``ఏం చేయాలో.. ఎంత చేయాలో అంతా చేయండి.. కానీ సామాన్యుడికి ఇబ్బంది కలగకూడదు`` అంటూ అధికారులకు, మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. హోటల్ యజమానులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి, బ్లాక్ మార్కెట్ కు తావులేకుండా పారదర్శకమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
గ్యాస్ బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటం, డెలివరీ ఆలస్యం కావడం వంటి ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తుత గ్యాస్ నిల్వలు మరియు సరఫరా గొలుసు గురించి సీఎంకు వివరించారు. ప్రభుత్వ తాజా చొరవతో రాబోయే 24 నుంచి 48 గంటల్లో గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక భేటీ అనంతరం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.