బీజేపీ ఫుల్ ప్రెజ‌ర్‌... త‌గ్గేదేలే అంటోన్న విజ‌య్ ..!

admin
Published by Admin — March 16, 2026 in Politics, National
News Image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. గత నాలుగైదు నెలలుగా తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారుతూ వస్తోంది. రాజకీయ సమీకరణాలు రోజురోజుకు శ‌రవేగంగా మారిపోతున్నాయి. టీవీకే అధినేత తమిళ స్టార్ హీరో ఇళ‌య‌ దళపతి విజయ్‌ను తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ గత రెండు నెలల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి. కూటమిలో చేరితే 80 అసెంబ్లీ సీట్లతో పాటు విజయ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తామని బిజెపి ఢిల్లీ స్థాయి నుంచి లాబీయింగ్‌ చేసింది. అయితే విజయ్ మాత్రం ముందు నుంచి బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లే విష‌యంలో అస్సలు ఒప్పుకోవ‌డం లేదు.

తాజాగా బిజెపి ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ పట్ల విజయ్ ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదని తమిళ్ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక్కడ విజయ్ పార్టీ సిద్ధాంతాలు వేరు... బిజెపి భావజాలం వేరు.. ఈ రెండిటి మధ్య పొంతన కుదిరే పరిస్థితి లేదు. ఒకవేళ బిజెపితో పొత్తు పెట్టుకుంటే విజయ్ తన భావజాలానికి పూర్తి విరుద్ధంగా రాజకీయాల్లో నడవవలసి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకునే విజయ్ ప్రస్తుతానికి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే బిజెపి నుంచి విజయ్‌కు ఈ ఆఫర్ వచ్చింది. అయితే బిజెపితో చేతులు కలిపితే తన పార్టీ మూల సిద్ధాంతాలకే ముప్పు వస్తుందని విజయ్ బిజెపితో కలిసి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.

ఢిల్లీ స్థాయిలో చాలా తీవ్రమైన ఒత్తిడి వచ్చిన విజయ్ ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదని సమాచారం. డీఎంకే లాంటి బలమైన శక్తిని ఎదుర్కోవాలంటే విజయ్ లాంటి ప్రజాకర్షణ ఉన్న నాయకుడు అవసరం అని బిజెపి భావిస్తుంది. అందుకే గత కొంతకాలంగా విజ‌య్‌తో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. 80 సీట్లు ఇవ్వడం ద్వారా టీవీకేను కూటమిలో కీలక భాగస్వామిని చేయాలని బిజెపి భావించినా విజయ మాత్రం సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగాలని డిసైడ్ అయిపోయారు. అలాగే బిజెపి ఆఫర్ చేసిన డిప్యూటీ సీఎం పదవిని కూడా విజయ్ తిరస్కరించారు. విజయ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయం తీసుకోవడంతో తమిళనాడు ఎన్నికలలో ముక్కోణ‌పు పోటీ ఖాయం అవుతుంది. ఏదేమైనా డిఎంకె నేతృత్వంలోని కూటమిని విజ‌య్ ఒంట‌రిగా ఢీ కొట్టేందుకు సిద్ధ‌మైపోతున్నారు. మ‌రి త‌మిళ ఓట‌రు ఈ మూడు పార్టీలు కూట‌ముల‌లో ఎవ‌రిని హీరోను చేస్తాడు.. ఎవ‌రిని జీరోను చేస్తాడో ?  చూడాలి.

Tags
Thalapathy Vijay Tamil Nadu Elections DMK AIADMK BJP TVK Tamil Nadu Elections 2026
Recent Comments
Leave a Comment

Related News