ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వేగం పెంచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తనకు సాటిలేరని మరోసారి నిరూపించారు. ముస్లిం సోదరుల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ, గంటల వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కేవలం వేడుకగానే కాకుండా, ఇమామ్, మౌజన్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. గత ఆరు నెలలుగా తమ గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని కొందరు బాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన సీఎం, అక్కడికక్కడే హామీ ఇచ్చారు. చెప్పడమే ఆలస్యం.. మరుసటి రోజు ఉదయానికల్లా రూ. 45 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది ఇమామ్లు మరియు మౌజన్లకు ఈ నిర్ణయంతో నేరుగా ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ ఇప్పుడు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రస్తుతం ఇమామ్లకు నెలకు రూ. 10,000, మౌజన్లకు రూ. 5,000 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ నిధులు విడుదలవ్వడంపై ముస్లిం మైనారిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పనితీరులో వేగానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా నిధుల విడుదల అంటే నెలల తరబడి ఫైళ్లు తిరగాలి, కానీ సీఎం ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేసి గంటల వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేశారు. ఎక్కడా దళారుల ప్రమేయం లేకుండా, టెక్నాలజీ సాయంతో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే నగదు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి రంజాన్ పర్వదినం వేళ ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ తీపి కబురు, వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోంది.